– ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
– గవర్నర్ తమిళి సై సహా పలువురి పరామర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘నా మీద అభిమానంతో నన్ను చూసేందుకు ఆస్పత్రికి రావొద్దు.. తద్వారా నాతోపాటు వందలాది పేషెంట్లకు ఇబ్బంది కలిగించొద్దు…దయచేసి సహకరించండి…’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోలుకుని త్వరలోనే అందరి మధ్యకు వస్తానని ఆయన తెలిపారు. ఇన్ఫెక్షన్లు సోకుతాయనే కారణంతో డాక్టర్లు తనను బయటకు పంపటం లేదనీ, అందువల్ల తనకోసం ఎవరూ ఆస్పత్రి వద్దకు రావద్దని పేర్కొంటూ మంగళవారం ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాననీ, త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటానని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అప్పటిదాకా సంయమనం పాటించి దవాఖానా వద్దకు రావొద్దంటూ సూచించారు. తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి మొక్కారు. ‘నన్ను చూడటానికి వస్తున్న మీరూ ఇబ్బంది పడొద్దు.. ఆస్పత్రిలో ఉన్న పేషెంట్లూ ఇబ్బంది పడొద్దు…’ అని సూచించారు. మరోవైపు కేసీఆర్కు పరామర్శలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ మంగళవారం యశోదా ఆస్పత్రికి వెళ్లారు. మాజీ సీఎంను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఫోన్ చేసి, కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా మరోసారి కేటీఆర్కు ఫోన్ చేసి, కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే లాస్య నందిత, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్, మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్, పలువురు జర్నలిస్టులు కేసీఆర్ను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు ముంజేతికి కంకణాన్ని కట్టారు.