దుక్కులు దున్నుతూ.. విత్తులు నాటుతూ..

– వ్యవసాయ పనుల్లో రైతులు నిమగం
– వర్షాలు కురుస్తుండటంతో బిజీబిజీ
– విత్తన దుకాణాల వద్ద రైతుల బారులు
– ఎంఆర్‌పీ ధరలకు మించి విక్రయం

నవతెలంగాణ-
ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మెరుగవుతున్నాయి. మూడు వారాలు ఆలస్యంచేసిన నైరుతి పలకరించడంతో రైతులు ఖరీఫ్‌ వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. జూన్‌లో ఇప్పటి వరకు 9.55 సెం.మీ సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా కేవలం 3.04 సెం.మీ వర్షమే కురిసింది. సాధారణం కంటే 68శాతం లోటు ఉంది. ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మూడురోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు పలుచోట్ల సాగు పనులు ముమ్మరం చేశారు. విత్తనాలు విత్తే పనిలో కొందరుండగా.. మరికొందరు దుక్కులు దున్నుతున్నారు. పత్తి అచ్చు తోలే పనుల్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల రైతులు నిమగమయ్యారు.
వర్షాగమనంతో సాగు పనుల్లో…
గతేడాది మే చివర రోహిణి కార్తెలోనే రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు ఈ ఏడాది మృగశిర పూర్తయ్యి ఆరుద్ర కార్తె సమీపించాక కురుస్తుండటంతో ఆలస్యంగా దుక్కులు చేసి, విత్తనాలు వేస్తున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగయ్యే అవకాశం ఉందని అంచనా. ఖమ్మం జిల్లాలో 6.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. దీనిలో వరి 2,89,983 ఎకరాలు, పత్తి 2,23,617 ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది.
వర్షాల ఆలస్యమే భద్రాద్రి రైతుకు మేలు..
గతేడాది వర్షాలు మే చివరలోనే కురవడంతో జూన్‌ చివరి నాటికి భద్రాచలం, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లోని గోదావరి పరీవాహక మండలాలు పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావానికి లోనయ్యి పంటలు దెబ్బతినడంతో సాగు విస్తీర్ణాలు పడిపోయాయి. ఈ ఏడాది వర్షాలు రావాల్సిన దానికన్నా కొంత ఆలస్యమైనా బ్యాక్‌వాటర్‌ ముప్పు తప్పుతుండటంతో సమృద్ధిగా పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అందుకే ధర తగ్గినా పత్తి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతోందని అంచనా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో 5,05,011 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ఈ ఏడాది 5,77,409 ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. జిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. గతేడాది 1.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఈ ఏడాది 2,14,302 ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచనా. మిర్చి గతేడాది 25వేల ఎకరాల్లో వేస్తే ఈసారి 30వేల ఎకరాల్లో వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వరి 1,65,025 ఎకరాల్లో వేయనున్నట్టు భావిస్తున్నారు.
పొరుగు జిల్లాల నుంచి రాకతో ఖమ్మంలో విత్తనాలు టైట్‌..
పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఖమ్మంలో విత్తనాలు కొనుగోలు చేసేందుకు వస్తుండటంతో ఇక్కడ విత్తనాలు దొరికే పరిస్థితి లేకుండా పోతుంది. వరి, అపరాలు, నూనెగింజల విత్తనాలను తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చాయి. పత్తి, మిర్చి విత్తనాలను ప్రయివేటు కంపెనీలు మార్కెట్లోకి తెచ్చాయి. తొలకరి పలకరించగానే రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరారు. పొరుగున మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్‌ రూరల్‌, నల్లగొండ తదితర జిల్లాల నుంచి రైతులు ఖమ్మం వచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తుండటంతో కొరత ఏర్పడుతోంది. డిమాండ్‌ ఉన్న పత్తి, మిర్చి విత్తనాలు లభించకపోవడంతో జిల్లా రైతులు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల నుంచి తెప్పించుకుంటున్నారు. కొందరు రైతులు ఇక్కడే బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌ ఉన్న యూఎస్‌ 7067 పత్తి విత్తనాలు వ్యవసాయశాఖ అధికారుల సొంత వ్యవసాయానికే లభించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అటు మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ, చిన్నగూడురు మండలాల్లో అనుమతిలేని బీటీ-3 పత్తి విత్తనాలను గతేడాది సాగు చేశారు. ఒక్క మరిపెడ మండలం గుండెపూడిలోనే వంద ఎకరాలకు పైగా సాగు చేయడం గమనార్హం. కలుపు సమస్య లేకపోవడం, తెగుళ్ల నివారణ శక్తి అధికంగా ఉండటంతో అనుమతి లేకున్నా ఈ విత్తనాల సాగుకు రైతులు సమాయత్తం అవడంతో టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడులు చేసి పట్టుకుంది. అయినప్పటికీ రైతులు ఈ గింజలపై ఆసక్తి చూపుతున్నారు. 2222 మిర్చి విత్తనాల విషయంలోనూ ఇదే పరిస్థితి. దీన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా వర్షాల రాకతో రైతులు పనుల్లో బిజీ అయ్యారు.
కావాల్సిన విత్తనాలు దొరకట్లేదు..
– వనవాసం రాంరెడ్డి, గుండెపూడి,
మరిపెడ మహబూబాబాద్‌ జిల్లా అయినప్పటికీ మాకు ఏ పని ఉన్నా ఖమ్మం రావడమే వాల్తి. ప్రతియేటా గాంధీచౌక్‌లోనే విత్తనాలు తీసుకెళ్తాం. ఈ ఏడాది కూడా వచ్చాం. నాకు కావాల్సిన మిర్చి విత్తనాలు 2222 కొద్దిరోజుల క్రితం తీసుకుపోయా. వర్షాలు రాక దుక్కిచేయ లేదు. పత్తి అచ్చు తోలలేదు. ఇప్పుడు వానలొస్తుండటంతో యూఎస్‌ 7067 పత్తి విత్తనాల కోసం వచ్చా. కానీ దొరకట్లేదు. రూ.ఐదారొందలు రేటు ఎక్కువ పెడతానన్నా లేవంటున్నారు. పది రోజుల నుంచి ఎదురుచూస్తున్నా రావట్లేదు.

Spread the love