హీరో మోటో చైర్మెన్‌పై పీఎంఎల్‌ఎ కేసు

PMLA case against Hero Moto chairman– ముంజల్‌ నివాసాల్లో ఈడీ దాడులు
-పడిపోయిన షేర్ల ధరలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మానీలాండరింగ్‌ కేసును నమోదు చేసిందని సీఎన్‌బీసీ ఓ కథనంలో వెల్లడించింది. మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో సోమవారం ముంజల్‌కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు ఢిల్లీ సహా గురుగ్రామ్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. పవన్‌ ముంజల్‌ సన్నిహితుల్లో ఒకరు సరైన పత్రాలు లేకుండా విదేశీ కరెన్సీ తరలిస్తూ డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడడంతో ఈ దాడులు జరుగుతున్నట్టు తెలిసింది. మరోవైపు హీరో మోటోకార్ప్‌ బినామి కంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లిస్తున్నట్టు ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 17న ఒక కీలక కంపెనీతో హీరో మోటో కార్ప్‌కు ఉన్న సంబంధాలపై విచారణకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గతేడాది సైతం పన్ను ఎగవేత ఆరోపణలతో హీరో మోటోకార్ప్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ దాడుల నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో హీరో మోటో షేర్‌ 3.14 శాతం పతనమై రూ.3,103 వద్ద ముగిసింది. ప్రస్తుత ఏడాది జులైలో హీరో మోటో కార్ప్‌ అమ్మకాలు 12.18 శాతం పతనమై 3,91,310 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే మాసంలో ఏకంగా 4,45,580 యూనిట్ల అమ్మకాలు చేసింది.

Spread the love