జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు

POCSO case registered against Johnny Masterనవతెలంగాణ-గండిపేట్‌
ప్రముఖ డ్యాన్సర్‌ జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేశారు. తనపై జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా కొరియోగ్రాఫర్‌ రాయదుర్గంలో ఫిర్యాదు చేయగా అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు కేసును నార్సింగి పీఎస్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే జానీ మాస్టర్‌ తనను గతంలో సాంగ్‌ కొరియోగ్రఫీ కోసం ముంబయికి తీసుకెళ్లారని, అక్కడ హౌటల్‌లో తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను మైనర్‌నని తెలిపింది. అలాగే హైదరాబాద్‌లోనూ, ఇతర అవుట్‌ డోర్‌ షూటింగ్స్‌ సమయా ల్లోనూ తనపై లైంగికదాడికి పాల్పడినట్టు యువతి తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని జానీ మాస్టర్‌ బెదిరించారని ఆరోపించింది. అయితే మైనర్‌పై లైంగికదాడికి పాల్పడిన నేపథ్యంలో జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జానీ మాస్టర్‌ పరారీలో ఉన్నారు. అతన్ని పట్టుకోవడం కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే అతన్ని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించారు.

Spread the love