పోడు రైతులకు పట్టాలివ్వాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు,మాజీ ఎంపీ బాబురావు
– ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ-పినపాక
గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల్లో సర్వే పూర్తి చేసి అందరికీ పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు వేధింపులు ఆపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ బాబురావు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం), తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోడు రైతులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ-బయ్యారం పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫారెస్ట్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కిలోమీటర్ల మేర వేల సంఖ్యలో గిరిజనులతో పాటు ఎటు చూసినా ఎర్ర జెండా రెపరెపలాడింది. ర్యాలీలో భాగంగా ఈ-బయ్యారం క్రాస్‌ రోడ్‌లో గల కొమరం భీమ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, పోడు సాగుదారులపై అటవీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ పోడు భూములకు పట్టాలు ఇస్తామని, అవి ప్రింట్‌ అయ్యాయని రేపో మాపో అందిస్తామని ఒకపక్క చెబుతుంటే.., మరోపక్క పోడు సాగును అటవీ అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. అటవీ భూముల విషయంలో అక్కడి అధికారుల, స్థానికుల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణలో పోడు భూముల సమస్య అనేది ఇప్పటిది కాదని ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతోందన్నారు. ప్రతిసారీ ఎన్నికలప్పుడు ఇది రాజకీయ అస్త్రంగా మారుతోందని, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాబట్టి పోడు భూముల్లో కందకాలు తవ్వినా, ప్లాంటేషన్‌ వేస్తామని అటవీ శాఖ అధికారులు వచ్చినా ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సాగుచేసుకుంటున్న అందరికీ హక్కులు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పితే ఊరుకోమన్నారు. సాగుచేసుకుంటున్న అటవీహక్కుల చట్టం ప్రకారం వారందరికీ పట్టాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. అనంతరం ఫారెస్ట్‌ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కన్వీనర్‌ నిమ్మల వెంకన్న, మండల కమిటీ సభ్యులు మడివి రమేష్‌, దుబ్బా గోవర్ధన్‌, కల్తి వెంకటేశ్వర్లు, దడిగల వెంకన్న, నట్టి శంకరయ్య, పాండురంగాపురం సర్పంచ్‌ ఈసం భవతి, గిరిజనులు, తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Spread the love