ఈ కాలానికి అవసరమయిన పద్యాలు

Poems that are essential for these timesరంజాన్‌ మాసం ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత కలిగినది. ఎంతో శ్రద్ధతో అల్లాను ఆరాధిస్తారు. నమాజు చేస్తారు. ఆ సందర్భంలో ముస్లింలు పనుల్లో నిమగమవుతూ రోజా ఉంటూ ఆ కాలమంతా దేవునికి దగ్గరగా గడుపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో కవి ఏమి ఆలోచిస్తాడు? ఏమి ఆలోచించాలి? దేవుని పట్ల ఆరాధననే కలిగియుండాలా? రోజా ఉంటూనే దేశ కాలమాన పరిస్థితులను ఆలోచించాలా? నిఖార్సైన కవి కాబట్టి అఫ్సర్‌ రెండో వైపుగానే అడుగేశారు. ఇలా రోజుకొకటి చొప్పున ముప్ఫై ఉపవాస పద్యాలు రాశారు. తనలో ఉన్న బాధనంతా పద్యంగా మలిచారు. ముస్లింగా తాను అనుభవిస్తున్న స్థితిని పద్యాల్లోకి పట్టుకొచ్చారు. ఉపవాసపద్యాల పేరుతో తన జీవితాన్ని తానే ఓ చుట్టు చుట్టేశారు. మళ్ళీ అమ్మ దగ్గరికెళ్ళారు. చిన్ననాటి ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. వివిధ దేశాల్లో జరుగుతున్న దమనకాండను ముఖ్యంగా గాజాలో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని కవిత్వం చేశారు. వీటన్నింటిని అఫ్సర్‌ ఆంగ్లంలో రాశారు. వాటిని శ్రీనివాస్‌ గౌడ్‌, అనంతు తెలుగులోకి అనువదించారు. శ్రీనివాస్‌ గౌడ్‌ ఒక అడుగు ముందుకేసి ‘ఉపవాస పద్యాలు’ పేరుతో ఒక పుస్తకమే తీసుకొచ్చారు. తను అనువాదం చేసిన ఆ పుస్తకంలోని పద్యాలను పరిశీలిద్దాం.

శ్రీనివాస్‌ గౌడ్‌ కవిగా ఎనిమిది కవితాసంపుటాలు తీసుకొచ్చారు. మార్జినోళ్ళు కథా సంపుటి ఆవిష్కరించుకొని కథకుడిగా ప్రవేశించారు. శ్రీనివాసం పేరుతో వ్యాససంపుటి రాబోతుంది. హైకూలు, దేశదేశాల కవిత్వం అనువాదాలు వారు చేస్తున్నారు. కవిత్వం రాయటం ఒక్కోసారి మన చేతుల్లో ఉండదు. ఆయా సందర్భాలను బట్టి తీవ్రతతో బయటికి వస్తుంది. అఫ్సర్‌ ఈ పుస్తకం కోసమని రాసిన మాటలో ఒక పద్యంతో మొదలయిన ప్రస్థానం ముప్ఫై పద్యాలు వరకు సాగటం ఊహించలేనిది అన్నారు. కవిత్వం తనను తానే రాయించుకునే సందర్భంలోకి వెళ్తుంది. ఇది అలాంటిదే.
ఈ పద్యాలు రాస్తున్న సందర్భంలోనే వారు పనిచేస్తున్న యూనివర్సిటీలోని విద్యార్థుల్లో ముఖ్యంగా ప్రస్తుతం వేదనాభరిత స్థితిని అనుభవిస్తున్న పాలస్తీనా వారు ఉండటం తనను కబళించి వేసింది. అందుకే ‘రొట్టె ముక్క తింటుంటే గాజా’ కనిపిస్తుంది అని రాయగలిగాడు. కవిగా తాను ఊరుకున్నా ఆయనలోని ఉపాధ్యాయుడు ఊరకనే ఉండడు కదా! కవిని మేల్కోల్పి ఈ వాక్యాలను పురమాయించి ఉంటాడు. అందుకే ప్రతి మినీ కవితను ప్రభావితంగా రాయగలిగారు.
ఉపవాస పద్యాల్లో ఎంత ముస్లింల జీవన స్థితిగతులను మాట్లాడినా కొన్ని పద్యాల్లో తన స్వీయానుభవాల్లోని విషయాలను పద్యాల్లోకి పట్టుకొచ్చారు. ముస్లింలు పండుగ సందర్భంలో దానధర్మాలు చేయటం ప్రత్యేకించి చూడవచ్చు.
ఆ సందర్భంలో లేని వారికి తమ సంపాదనలో కొంత దానం చేయాల్సి ఉంటుంది. అలాంటి ఒకానొక సందర్భాన్ని గుర్తుచేసుకొని ప్రతి శుక్రవారం తెల్లబట్టలు వేసుకొని ఆనందించటం కాదు, వస్త్రాలు లేని వాళ్ళకు ఒక్క వస్త్రమన్న ఇవ్వాలి కదా అని తనకు తాను చెప్పుకున్నట్టుగా చెబుతూ అందరిని ఆలోచనలో పడేశారు.
దేశంలో ముస్లింలపై ఉన్న ద్వేషాన్ని మినీ కవితల్లో చూపెట్టారు. ఉపన్యాసాలతో కడుపులు నిండవు, సాటి మనిషికి ఇంత కూడు పెట్టే ఆలోచన చేయాలని చురకలు వేశారు. సోదరభావాన్ని తెలియజేస్తూ రంజాన్‌ రొట్టెనే కాదు, మొహర్రం రక్తం కూడా ఒక్కటే అని తనలోని అభిమతాన్ని బయటపెట్టారు. ఇలా ఒక్కో అంశాన్ని తీసుకుని ముఫ్ఫై రోజులు ఈ పదునైన పద్యాలు రాశారు.
మొదటగా చదివినప్పుడు ఉపవాసం పద్యాలు అంటున్నారు, కేవలం రంజాన్‌ పండుగలోని విశిష్టతనో, ఆ సందర్భంలోని వారి అలవాట్లనో, వారు చేసే దానధర్మాలనో కవిత్వం చేశారేమో అనిపించింది. కొన్ని మాత్రమే అలా రాసిన పద్యాలు ఇందులో ఉన్నాయి. మిగతావన్నీ తాను వేదన చెందుతూ రాసిన పద్యాలు. కవి దక్పథాన్ని పట్టించే పద్యాలు. ఈ కాలానికి అవసరమయిన పద్యాలు.
ఈ పద్యాలను శ్రీనివాస్‌ గౌడ్‌ ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించారు. అనువాద ప్రక్రియ గురించి నాకు పెద్దగా తెలియదు కానీ అఫ్సర్‌ తెలుగులో రాస్తే ఎలా ఉంటాయో అంత దగ్గరగా అనువాదం చేసినట్టు అనిపించింది. జపనీయ కవిత్వం, చైనీయుల కవిత్వాన్ని ఆంగ్లంలో నుండి తెలుగులోకి అనువదించిన అనుభవం శ్రీనివాస్‌ గౌడ్‌కి ఉంది. ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రయోగాత్మక పుస్తకం. ఇందులోనే ఒక పేజీలో అఫ్సర్‌ రాసిన ఆంగ్ల కవిత. ఇంకో పేజీలో శ్రీనివాస్‌ గౌడ్‌ అనువదించిన తెలుగు కవిత ఉన్నాయి. తక్కువ సమయంలోనే చదివించి ఎక్కువ అనుభూతికి, ఆలోచనకు లోనుచేసే పుస్తకమిది. ఓ రెండు పద్యాలే మీకిక్కడ ఇస్తున్నా. మిగిలినవి చదవాలంటే ‘ఉపవాస పద్యాలు’ పుస్తకాన్ని మీరు సొంతం చేసుకోవాల్సిందే.

– డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551

1.
అప్పట్లో
ప్రేమ, దయ నిండిన కథలే
వినపడే రంజాన్‌ మాసంలో
మేల్కొనే వాణ్ని.
ఇప్పుడు –
నేను ఎదుర్కొంటున్నదంతా
ద్వేషం, రక్తపాతంలో కూరుకున్న లోకాన్ని.
ఈ ప్రయాణానికి ఏ పేరు పెట్టాలో?

2.
నిజమేదీ పట్టని
ఉపన్యాసాలతో అలసిపోయాను.
ఏమీ సాధించలేని
డొల్ల పదాలతో డస్సిపోయాను.
ఇక ఈ పొద్దు నుంచి
మునిమాపు దాకా
మీ ఈ ప్రార్థనలన్నీ దేని కోసం?!
కళ్ళు తెరవండి-
మీ చుట్టూ మూగి,
మొరపెడ్తున్న
భిక్షపాత్రలను చూడండి!
ఆంగ్లం: అఫ్సర్‌
తెలుగు: శ్రీనివాస్‌ గౌడ్‌

Spread the love