– ప్రభుత్వం, మహిళా కమిషన్ స్పందించకపోవడం దారుణం : ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి
– బాధితురాలికి పరామర్శ
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో గిరిజన మహిళను బెల్టుతో విపరీతంగా కొట్టడం అన్యాయమని, బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి, సహాయ కార్యదర్శి శశికళ డిమాండ్ చేశారు. పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడి రంగారెడ్డి జిల్లా కర్మాన్‌ఘాట్‌లోని జీవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత గిరిజన మహిళను శనివారం ఐద్వా బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. ఇంటికి వెళ్తున్న గిరిజన మహిళను అడ్డుకుని ఇద్దరు మగ పోలీసులు అసభ్యకర పదజాలంతో తిడుతూ జీపులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. మహిళ అని చూడకుండా బెల్టుతో విపరీతంగా కొట్టడం అన్యాయమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధితురాలికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన మహిళను తీవ్రంగా కొడితే కనీసం ప్రభుత్వంగానీ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గానీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్పందిస్తేనే ఆ కుటుంబానికి భరోసా కలుగుతుందని అన్నారు. ఇప్పటికైనా వెంటనే ఈ ఘటనకు పాల్పడిన పోలీసులపై కేసు నమోదు చేసి విచారించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.