పార్లమెంటులో ఘటన.. నిందితులకు పోలీస్‌ కస్టడీ పొడిగింపు

నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంటు భవనంలో అలజడి ఘటనలో నిందితులను పోలీసులు గురువారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో నలుగురు నిందితులకు పటియాలా హౌస్‌ కోర్టు తొలుత ఏడు రోజుల కస్టడీ విధించగా..  ఆ గడువు నేటితో ముగిసింది. దీంతో మరోసారి పోలీసులు నిందితులను ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. పార్లమెంటులో అలజడి సృష్టించిన కేసులో అరెస్టయిన మనోరంజన్‌ డి, సాగర్‌ శర్మ, అమోల్‌ ధన్‌రాజ్‌ శిందే, నీలమ్‌దేవిలను 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని దిల్లీ పోలీసులు కోరారు. పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న జడ్జి ఈ నలుగురినీ జనవరి 5వరకు ( 15 రోజుల పాటు) పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటు ఘటనలో నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) చట్టం కింద కేసులు నమోదైంది. నిందితుల చర్యలు 2001లో ఉగ్రవాడిని ప్రతిబింబిస్తున్నాయని.. వారి అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకోనే దిశగా వివిధ కోణాల్లో దిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Spread the love