నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుపై తెలంగాణ రాచకొండ పోలీసులు సీరియస్ అయ్యారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో డిపార్ట్‌మెంట్ అప్రమత్తమైంది. మోహన్ బాబు వద్దనున్న గన్‌తో పాటు మంచు విష్ణు వద్దనున్న గన్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలని స్థానిక పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గతంలో జూబ్లీహిల్స్ నుంచి ఇద్దరు గన్ లైసెన్స్‌లు పొందారు. ఇదిలా ఉండగా కాసేపటి క్రితం జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మంచు మనోజ్, మౌనిక దంపతులు చేరుకున్నారు.
సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ గేట్లు తోసుకొని లోనికి వెళ్లారు. మనోజ్‌తో పాటే మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబును మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మీడియా ప్రతినిధులపై దారుణంగా, అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. స్వయంగా న్యూస్ ఛానల్ మైక్ లాక్కొని కొట్టారు. ఈ దాడిలో ఇద్దరు మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.