77 ఏండ్ల స్వాతంత్ర భారతంలో బ్రిటీషు పద్ధతులు పాటిస్తున్న పోలీసులు

77 years of independence in India Police following British methods– ఇంకా పోలీసుల కొలిమిలో ఎంతమంది
– అమాయకులు బలైపోతారో?
– నాగేందర్‌ పోలీసులకు ఆశ చూపించినందుకే
– సునీతను చిత్రహింసలకు గురిచేశారు
– దళిత మహిళ భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
– థర్డ్‌ డిగ్రిని ఉపయోగించిన పోలీసులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి
– హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారించి
– బాధితులకు న్యాయం చేయాలి
– పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణరావు
నవతెలంగాణ-షాద్‌నగర్‌
77 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో వలస బ్రిటీష్‌ పద్ధతులు పోలీసులు పాటిస్తున్నారని, ఇలాంటి పోలీసుల వలన ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు అన్నారు. దళిత మహిళ సునీతపై షాద్‌నగర్‌ పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడంతో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిజానిర్ధారణ చేశారు. ముందుగా కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డి గూడకు చేరుకుని జరిగిన విషయాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాద్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ పోలీసుల చప్పుడు లేని పరిపాలన కొనసాగిస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి పాలనలో ఇప్పటికే ఒక లాకప్‌ డెత్‌, ఎన్‌కౌంటర్‌ కూడా జరిగిందన్నారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం పదేండ్ల పాలనలో 13 లాకప్‌ డెత్‌లు జరుగా,కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని మించి పాలన కొనసాగించే ఆలోచన చేస్తుందని విమర్శించారు. ఇంకా పోలీసుల కొలిమిలో ఎంత మంది అమాయకులు బలికావాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. దొంగతనం నెపంతో ఒక మహిళను సాయంత్రం ఆరు గంటల తరువాత పోలీస్‌ స్టేషన్‌లో ఎలా ఉంచారని, రాత్రి రెండు గంటలకు కొట్టి ఎవరైతే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారో, వారి కారులోనే పంపడం ఏంటని నిలదీశారు. నాగేందర్‌ పోలీసులకు ఎదో ఆశ చూపిస్తే, పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించా, లేదా నాగేందర్‌ పోలీసులకు ఉన్న సంబంధం ఎమిటని ప్రశ్నించారు. రాత్రి సమయంలో పోలీస్‌ స్టేషన్‌లో సునీత మహిళను వివస్రను చేసి నాగేందర్‌ అనే వ్యక్తితో రాత్రి చెడ్డి తెప్పించి ఆమెకు ఇప్పించడం ఏంటని, ఒక ప్రయివేటు వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌లోకి ఏలా అనుమతి ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దెబ్బలు తిని పూర్తి అంగవైకల్యాణికి గురైన బాధిత మహిళ భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా, వారి కుమారునికి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. థర్డ్‌ డిగ్రీ ఉపయోగించిన పోలీసులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించి, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలైన సునీతకు మెరుగైన వైద్యం అందించాలని, వారికి ఉండడానికి ఇల్లు లేనందున వారికి పక్కా గృహం ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలన్నారు. ఇంతేకాకుండా ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షులు సుభాన్‌, ప్రధాన కార్యదర్శి బాలయ్య, సహాయ కార్యదర్శి రాములు, లక్ష్మి నారాయణ, వెంకటయ్య, బాలకృష్ణ, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love