
నవతెలంగాణ – నాగార్జునసాగర్
ఎన్నికల నేపథ్యంలో సిఐ బిసన్న, ఎస్.ఐ సంపత్ ఆద్వర్యంలో శుక్రవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద చెక్పోస్ట్ ను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని తెలంగాణ, ఆంధ్ర చెక్పోస్ట్ వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేసి 24 గంటల పాటు వాహనాలను పోలీసులు తనిఖీలను చేశారు.ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చే వాహనాలను ముమ్మర తనిఖీ చేశారు. కార్లు, జీపులు, క్రూయిజర్లు, ఆటోలు, ట్యాక్సీలు, డీసీఎంలు, ట్రాలీ ఆటోలు తదితర ప్రైవేట్ వాహనాలను చెక్ చేస్తున్నారు. వాహనాలలో డబ్బులు, ఇతర వస్తువులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్నట్లు నాగార్జునసాగర్ సర్కిల్ సి.ఐ బిసన్న, ఎస్సై సంపత్ తెలిపారు.