కొమురవెల్లిలో భక్తులపై లాఠీచార్జీ చేసిన పోలీసులు

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని కొమురవెల్లి దేవస్థానం వద్ద నిన్న భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి వచ్చిన మహిళా భక్తులపై కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి కూడా భక్తులు పోటెత్తారు. ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లింగోద్భవ కాలంలో ప్రారంభమైన పెద్దపట్నం..శనివారం వేకువజాము వరకు కొనసాగింది. ఉత్సవ విగ్రహాలకు పెద్దపట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారు పట్నం దాటిన అనంతరం భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. పెద్దపట్నం అనంతరం పసుపు బండారీ తీసుకునేందుకు భక్తులు పోటెత్తారు.  ఈ క్రమంలో పట్నం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెల పైనుంచి దూకారు. ఈ సమయంలో భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Spread the love