పేదల గుడిసెలపై పోలీసుల దాష్టీకం

తెల్లవారకముందే పొక్లయినర్‌తో దాడి
పోలీసులు, గుడిసె వాసుల మధ్య తోపులాట, ఘర్షణ
 గుడిసె వాసుల అరెస్టు, విడుదల
నవతెలంగాణ-మహబూబాబాద్‌
తెల్లవారకముందే చీకట్లు వీడకుండానే పోలీసులు గుడిసె వాసులపై పొక్లయినర్‌తో దాడి చేశారు. రియల్‌ ఎస్టేట్‌ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు వేసిన గుడిసెలను ఆదివారం తెల్ల వారుజామున పోలీసులు, మున్సిపల్‌ అధికారులు.. పొక్లయినర్‌తో యథేచ్ఛగా కూల్చి వేశారు. ఈ అరాచకాన్ని పేదలు అడ్డుకొని ధర్నా చేశారు. పోలీసులతో జరిగిన ఘర్షణలో మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వందల సంఖ్యలో వచ్చిన పోలీసులు వందమంది పేదలను బలవంతంగా డీసీఎంలలో ఎక్కించి అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్‌ సమీపం లో ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు ఆక్రమించి ప్లాట్లుగా విభజించి విక్రయానికి పెట్టారు.

రెవెన్యూ అధికారుల అండదండలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పక్కనే ఉన్న పట్టా భూమి సర్వే నెంబర్లు వేసి యథేచ్చగా విక్రయాలకు తెగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) నేతలు, నిరుపేదలు.. ఆ భూమిని పరిరక్షించాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడంతో పేదలు గుడిసెలు వేశారు. మూడు నెలలుగా పేదలు ఒక్కొక్కరు 80 గజాల భూమిలో గుడిసె వేసుకొని నివసిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి ఇంటి నెంబర్‌ ఇవ్వాల్సిన అధికారులు.. అందుకు విరుద్ధంగా గుడిసెలు తొలగించే పనికి పూనుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున మహబూబాబాద్‌ టౌన్‌ సీఐ సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది గుడిసెల వద్దకు వచ్చారు. సుమారు 20 ఎకరాల్లో వేసిన 2000 గుడిసెల కూల్చివేతకు ఉపక్రమించారు. పేదలు, మహిళలు, గిరిజనులు పోలీస్‌ వాహనాన్ని అడ్డుకొని ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రోక్లైన్లు తీసుకువచ్చి గుడిసెలు కూల్చివేతకు పూనుకోగా మహిళలు అడ్డుకున్నారు. పోలీసులు, మహిళలకు మధ్య ఘర్షణ, తోపులాట జరగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పేదలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ భూమిలో గుడిసెలు కూల్చవద్దని పట్టాలివ్వాలని నినదించారు. మూడు గంటలపాటు తావ్ర ఉద్రిక్తత నెలకొంది. దాంతో పోలీసులు.. డీసీఎం తీసుకుని వచ్చి వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
పేదల గుడిసెలు అన్యాయంగా కూల్చివేశారు
సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బానోత్‌ సీతారాం
ప్రభుత్వ భూములు ఆక్రమించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అండదండలతోనే పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు పేదల గుడిసెలను అన్యాయంగా కూల్చివేశారు. ప్రభుత్వం ఒకపక్క పేదలకు 58 జీవో ప్రకారం పేదల గుడిసెలకు పట్టాలిస్తామని చెబుతూనే.. మరోపక్క వారు వేసుకున్న గుడిసెలు కూల్చి వేయడం అన్యాయం. కొంతమంది రియల్‌ వ్యాపారులు ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా విక్రయిస్తున్నారు. ఆ భూముల రక్షణ కోసమే పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి.
దాడి అమానుషం..: ఎస్‌ వీరయ్య
ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలపై పోలీసులు దాడి చేయటం అమానుషమని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం తెల్లవారు జామున గుడిసెవాసులమీద పోలీసులు దాడి చేశారనీ, వాటిని నేల మట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన పేదలమీద నిర్దాక్షణ్యంగా లాఠీచార్జి చేసారని తెలిపారు. సుమారు వందమందిని అరెస్ట్‌ చేసి, వారిపై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు. నలభై మందిని బైండోవర్‌ చేశారని తెలిపారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పేదలు ధైర్యంగా నిలబడాలనీ, ఐక్యంగా ఉద్యమించాలనీ, ఇండ్లు సాధించుకునేవరకూ పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. గుడిసెవాసులు పోరాటానికి ప్రజాసంఘాల పోరాట వేదిక సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని తెలిపారు. ఇండ్లు, ఇండ్లస్థలాల సమస్యపై ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.
పేదలపై నిర్బందాన్ని ప్రయోగించటం అన్యాయమని తెలిపారు. ఇంటి వసతి జీవించే హక్కులో భాగమేనని న్యాయస్థానం కూడా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వ స్థలాలు, మిగులు భూములు, వ్యవసాయం అంతరించిన శిఖం భూముల మీద పేదలకు హక్కు ఉంటుందని తెలిపారు. ధనికులు కబ్జా చేస్తే పట్టించుకోకుండా, పేదలు గుడిసెలు వేసుకుంటే దాడులు చేయటమేంటని ప్రశ్నించారు. దాడులతో పేదల ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించాలని వీరయ్య కోరారు.

Spread the love