– ఊరిడిచి బయట తలదాచుకుంటున్న యువత
– బిక్కుబిక్కుమంటున్న కుటుంబ సభ్యులు
– పోలీసుల సోదాలతో భయాందోళనలో లగచర్ల
– తాజాగా మరో నలుగురి అరెస్ట్
– కేసు విచారణలో అదనపు డీఎస్పీగా శ్రీనివాస్ నియామకం
– విచారణ కొనసాగుతోంది : అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి, కొడంగల్, పరిగి
ఫార్మా భూ సేకరణ విషయంలో ప్రజలు, అధికారుల మధ్య జరిగిన ఘటనతో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల పరిధిలో పోలీసులు మరింత నిఘా పెంచారు. అధికారులపై దాడికి దారితీసిన ఘటనకు సూత్రధారి ఎవరు అనే విచారణలో భాగంగా నిత్యం ఆ గ్రామాల్లో పోలీసులు సోదాలు చేపడుతు న్నారు. దీంతో ఆ గ్రామాల్లో యువకులు కనిపించని పరిస్థితి నెలకొంది. ‘మా బిడ్డలెక్కడ ఉన్నారో తెలియడం లేదు.. ఐదు రోజుల పొద్దు అవుతుంది. ఫోన్ కలవడం లేదు.. ఏమి తిన్నారో ఎక్కడున్నారో దిక్కుతోచడం లేదు. పోలీసులు మా దగ్గర లేరు అంటుండ్రు..” అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల భయాని కి వారంతా ఎటు పోయారో తెలియడం లేదని సుశీల అనే మహిళ వాపోయింది. కొండగల్ నియోజకవర్గం దుద్యాల మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట రెవెన్యూ గ్రామాలు, నాలుగు గిరిజన తండాల ప్రాంతంలో భూసేకరణ కోసం ప్రభుత్వం ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే.. ఈ సభలో చోటు చేసుకున్న ఘటనతో ఐదు గ్రామాల్లో అలజడి చెలరేగింది. కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసులు పెట్టి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. శనివారం మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఉదjం పరిగి పీఎస్‌కు తరలించి, సాయంత్రానికి కొడంగల్ పీఎస్‌కు తీసుకొచ్చారు. అయితే, ఘటనకు సంబంధించిన విషయంపై పూర్తి విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ క్రమంలో పోలీసుల సోదాలతో ఈ ప్రాంతంలోని యువత భయంలో ఊరు విడిచి ఎక్కడో తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం రోటిబండ తండా, పూలిచింతకుంట తండా, ఆర్పీ తండా, హకీంపేట గ్రామాల్లో యువత గ్రామాలను వదిలి వెళ్లిపోయింది. దీంతో గ్రామాల్లో వారి తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి.
మరో నలుగురి అరెస్ట్
లగచర్ల ఘటనలో మరో నలుగురిని శనివారం అరెస్టు చేశారు. వీరిని పరిగి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే ఈ ఘటనలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డితోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో నలుగురిని మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. వైద్య పరీక్షలు నిర్వహించి, కొడంగల్ కోర్టులో హాజరు పరచనున్నారు. ఇప్పటికే 21 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొందరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
లగచర్ల కేసు విచారణలో అదనపు డీఎస్పీగా శ్రీనివాస్ నియామకం
లగచర్ల దాడి ఘటన విచారణను వేగవంతం చేసేందుకు పోలీసు యంత్రాంగం కరసత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం పరిగి డీఎస్పీ కార్యాలయానికి అదనపు డీఎస్పీని నియమించింది. పరిగి సీఐగా విధులు నిర్వహించి డీఎస్పీగా ప్రమోషన్ పొందిన శ్రీనివాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో అదనపు డిఎస్పీగా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.
విచారణ కొనసాగుతోంది : అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్
లగచర్ల ఘటనపై విచారణ కొనసాగుతోందని అడిషనల్ డీజీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో లగచర్ల ఘటనపై రెండు గంటలపాటు సమావేశమయ్యారు. అనంతరం జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డితో మహేశ్ భగవత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనపై పూర్తి స్థాయిలో, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు.