నవతెలంగాణ న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) మరణంతో రాష్ట్ర కమ్యూనిస్ట్, వామపక్ష ఉద్యమంలో ఓ అధ్యాయం ముగిసిందని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం ఉదయం ఆయన నివాసంలో మరణించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ పొలిట్‌బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది. 1996లో విద్యార్థి దశలో పార్టీలో చేరిన ఆయన విద్యార్థి, యువజన ఉద్యమాల్లో, పలు పోరాటాల్లో పాల్గన్నారు. 1968లో పశ్చిమబెంగాల్ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1971లో పార్టీ రాష్ట్రకమిటీకి, 1982లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కాలంలోనే ఆయన అంకిత భావంతో వివిధ బాధ్యతలను నిర్వహించే ముఖ్యమైన పార్టీ నేతగా ఎదిగారు. 1985లో నిర్వహించిన పార్టీ 12వ మహా సభల్లో కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2000-2015 వరకు పొలిట్‌బ్యూరో సభ్యులుగా కొనసాగారు. పార్టీ విధానాలను రూపొందించడంలో గణనీయమైన కృషి చేశారు.
మూడు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా, మంత్రిగా విశిష్టమైన పాత్ర పోషించారు. 2000, నవంబర్‌లో పార్టీ సీనియర్ నేత జ్యోతి బసు నుండి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తర్వాత మరో రెండు పర్యాయాలు ప్రమాణ స్వీకారం చేశారు. వామపక్ష ప్రభుత్వ విధానం, ప్రణాళికల అమలులో కీలక పాత్ర పోషించారు. బుద్ధదేవ్ సాంస్కృతిక సంస్థల అభివృద్ధికి, ప్రగతి శీల సాంస్కృతిక విలువలను కొనసాగించడానికి గణనీయమైన కృషి చేశారు.
సాహిత్యంపై మంచి అభిరుచి కనబరిచేవారు. రచయిత, కవి, నాటకరచయితగానూ కొనసాగారు. పలు అంతర్జాతీయ సాహిత్య రచనలను బెంగాలీలోకి అనువదించారు. చైనాలో మార్పులపై విస్తృత కథనాలు రచించారు. ఈ అంశంపై పుస్తకాన్ని కూడా ప్రచురించారు. బుద్ధదేవ్ అంకితభావంతో కూడిన కమ్యూనిస్ట్‌గా, అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ నిరాడంబరంగా రెండు గదుల అపార్ట్‌మెంట్‌లోనే నివసించారు. ఆయన మృతికి పొలిట్‌బ్యూరో విప్లవ నిశాళులు అర్పిస్తున్నట్లు తెలిపింది. ఆయన భార్య మీరా, కుమారుడు సుచేతన్‌లకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.