– చౌకగా లభిస్తున్న నిరుద్యోగుల సేవలు
– భారీగా నిధులు వెచ్చిస్తున్న పార్టీలు
– సోషల్ మీడియాలో విద్వేష ప్రసంగాలు, తప్పుడు సమాచారొం ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసే వ్యూహాలు
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ ఓటర్ల నాడిని పసిగట్టేందుకు రాజకీయ పార్టీలు కన్సల్టెంట్లను నియమించుకుంటున్నాయి. నిరుద్యోగులైన ఇంజినీర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లను తక్కువ జీతాలకు ఎంపిక చేసుకొని వారిని వివిధ రాష్ట్రాలకు పంపుతున్నాయి. ఈ విషయంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీ ముందు వరుసలో ఉంది. దేశంలోని పేరెన్నికగన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలలో చదివిన యువతీ యువకులను ఇంటర్వ్యూలో ఎంపిక చేసుకొని వారికి బాధ్యతలు అప్పగిస్తారు. ఓటర్ల జాబితాలను సేకరించడం, విశ్లేషించడం, వారి మనోగతాన్ని తెలుసుకోవడం వీరి పని.
బీజేపీ కన్సల్టెంట్లుగా పనిచేస్తున్న వారు ముందుగా పార్టీకి ఓటు వేయని వారిని గుర్తిస్తారు. వారిని వయసు, కులం, లింగం, మతం ఆధారంగా విభజిస్తారు. ఈ ఓటర్లను బీజేపీకి అనుకూలంగా ఎలా మార్చాలో వ్యూహాలు రూపొందిస్తారు. వీరందరూ నిఘా నీడలో పనిచేస్తుంటారు. మీడియాతో ముచ్చటించేందుకు వీరిని అనుమతించరు.
మార్కెట్ పెద్దదే
ప్రముఖ విద్యా సంస్థలు, బిజినెస్ స్కూల్స్, పేరెన్నికగన్న ఇంజినీరింగ్ కళాశాలల నుంచి బయటికి వచ్చిన వేలాది మంది పట్టభద్రులు ఇటీవలి కాలంలో రాజకీయ ప్రచారకుల అవతారం ఎత్తారు. ఇవన్నీ తాత్కాలిక ఉద్యోగాలే. చదువుకు తగిన ఉద్యోగం లభించే వరకూ ఇలాంటి ఉపాధిని వెతుక్కుంటారు. ఎన్నికల సమయంలోనే వీరికి డిమాం డ్ అధికంగా ఉంటుంది. ఈ రకమైన రాజకీయ కన్సల్టెన్సీల మార్కెట్ పరిమాణం 300 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఈ కన్సల్టెన్సీ లు జాతీయ రాజకీయ పార్టీలకే కాదు…అభ్యర్థులు, ప్రాంతీయ పార్టీల కు కూడా సలహాలు ఇస్తుంటాయి.
త్రిపురలో బీజేపీ ఎత్తుగడలు
చిన్న రాష్ట్రమైన త్రిపురలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కన్సల్టెన్సీలను నియమించింది. ‘నేషన్ విత్ నమో’ పేరుతో ఓ బృందం రాష్ట్రంలో తిరిగి ఓటర్ల వివరాలను సేకరించి విశ్లేషించింది. ప్రజలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ బృందం తెలుసుకుంది. పార్టీ నాయకత్వానికి వాటిని చేరవేసింది. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించిన బీజేపీ నాయకత్వం, తన ప్రచారంలో వాటిని గొప్పగా చెప్పుకుంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. వాస్తవానికి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ సమస్యలను ఎప్పుడో పరిష్కరించి ఉండాల్సింది. ఉదాహరణకు జమాతియా గిరిజనులకు చెందిన 80 ఆవాసాల కోసం నాలుగు అడుగుల ఎత్తులో సరిహద్దు గోడలు నిర్మించాల్సి ఉంది. ఎన్నికలకు ముందు వరకూ ఈ విషయాన్ని పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం, ఇటీవలే యుద్ధ ప్రాతిపదికపై వాటిని నిర్మించింది. అది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి రాకుండా జాగ్రత్త పడి ఓ కాంట్రాక్టరుకు ఆ పనిని అప్పగించి పూర్తి చేయించింది.
ఇవన్నీ వారి పనులే
ఎన్నికల వ్యూహకర్తలు చేసే పనులు చాలానే ఉంటాయి. ఓటర్ల జాబితాలను సేకరించడం, అధ్యయనం చేయడం, విశ్లేషించడం, ప్రచార ఎత్తుగడలు రూపొందించడం, ఏయే అంశాలను ప్రస్తావించాలో నిర్ణయించడం, ఎక్కడ బహుమతులు పంచాలో గుర్తించడం, ఓటర్లను సమీకరించేందుకు చేయాల్సిన ప్రసంగాలను రూపొందించడం, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలకు ప్రాచుర్యం కల్పించడం…ఈ పనులన్నింటినీ కన్సల్టెంట్లే పర్యవేక్షిస్తుంటారు.
తెలంగాణలో ‘ఇన్‌క్లూజివ్ మైండ్స్’
తెలంగాణలో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ‘ఇన్‌క్లూజివ్ మైండ్స్’ సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకుంటోంది. కేంద్ర కార్యాలయంలో ఉండి విధులు నిర్వర్తించే వారు కొందరైతే, క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ అసోసియేట్లు పనిచేస్తుంటారు. వీరు టెలిఫోన్ సర్వేలు కూడా చేస్తూ ఓటర్ల మనోగతాన్ని తెలుసుకుంటారు. ఇన్‌క్లూజివ్ మైండ్స్ సంస్థ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు ఇస్తుంది. ఈ సంస్థ సిబ్బందిలో 20-30 శాతం మంది ఐఐటీలు, ఐదు శాతం మంది ఐఐఎంల నుంచి వచ్చిన వారే. క్షేత్ర స్థాయి సిబ్బంది సేకరించే సమాచారాన్ని వివిధ భాగాలుగా విభజించి, యాభై డాష్‌బోర్డులలో ప్రదర్శిస్తారు. ఏ పోలింగ్ కేంద్రం పార్టీకి అనుకూలంగా ఉంది, ఏది వ్యతిరేకంగా ఉంది వంటి వివరాలను సైతం ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు.
తప్పుడు వార్తలు…విద్వేష పోస్టులు
ఎన్నికలలో విజయం సాధించాలంటే ఓటర్ల సమీకరణే అత్యంత ముఖ్యమైన అంశమని ఎన్నికల వ్యూహకర్త అభిమన్యు భారతి తెలిపారు. బీజేపీ విజయం సాధించాలంటే ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నదని అంటూ కాంగ్రెస్ గెలిస్తే ముస్లింలు మళ్లీ పెత్తనం చెలాయిస్తారని, వారిని నిలువరించకపోతే నేరాలు పెరుగుతాయని ప్రజలను హెచ్చరించాల్సి ఉంటుందని ఆర్‌ఎస్‌ఎస్‌కు సూచించినట్టు చెప్పారు. రాజకీయ పార్టీలు కన్సల్టెంట్లను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం, ఆన్‌లైన్ విద్వేషపూరిత ప్రచారం సాగిస్తాయని ఆల్ట్‌న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు పార్తిక్ సిన్హా వివరించారు. ‘ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తప్పుడు వార్తలు, విద్వేష పోస్టులు పెరుగుతుంటాయి. ఫేస్‌బుక్‌లో ప్రకటనల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు. వాటిలో తప్పుడు సమాచారాన్ని, ద్వేషపూరిత ప్రసంగాలను పోస్టు చేస్తుంటారు. ఈ పనులన్నీ రాజకీయ కన్సల్టెన్సీలే చేస్తాయి’ అని వివరించారు.
యువతే లక్ష్యంగా…
ఫేక్ న్యూస్‌కు ముస్లింలే లక్ష్యంగా మారుతున్నారని బూమ్ లైవ్ వెబ్‌సైట్ అంటోంది. ఏదైనా ఓ నియోజకవర్గంలో యువత ఓట్లు అధిక సంఖ్యలో ఉంటే మతపరమైన విభజన సృష్టించడం తేలిక అని హైదరాబాదులో ఎఫ్-జాక్ అనే కన్సల్టెన్సీని నడుపుతున్న మహమ్మద్ ఇర్ఫాన్ బాషా తెలిపారు. ‘యువతో అధిక భాగం ఏ రాజకీయ సిద్ధాంతానికీ కట్టుబడరు. నూతన ఆలోచనలు, భావాలను వారు స్వీకరిస్తారు. అందువల్ల వారి ఓట్లను సమీకరించడం సులభమవుతుంది’ అని వివరించారు. ఆయన గతంలో ఓ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున వ్యూహకర్తగా పనిచేశారు. ఇప్పుడు ఆ అభ్యర్థి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు.