రాజకీయ దాగుడుమూతలు

Sampadakiyamరాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. రూ.లక్షల కోట్ల ప్రజాధనం గంగపాలైదంటూ విపక్షాలు, సాగునీటిరంగ నిపుణులు బీఆర్‌ఎస్‌ సర్కారుపై ఒంటికాలిపై లేస్తున్నారు. దీన్నే అవకాశంగా తీసుకున్న కేంద్రంలోని బీజేపీ, ఎన్‌డిఎస్‌ఏ రిపోర్టును అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు పనికిరాదంటూ శ్రీరంగనీతులు వల్లిస్తున్నది. అనుమ తులన్నీ ఇచ్చిన మోడీ సర్కారు ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడంలో అర్థ మేంటి? అనాడేమో ఇంజినీరింగ్‌ అద్భుతంగా అభివర్ణించారు సీడబ్ల్యూసీ చైర్మెన్‌, కేసీఆర్‌ది అవినీతి కుటుంబమంటూ ఇప్పుడు కేంద్ర జలశక్తిశాఖ అమాత్యులు షేకావత్‌ నీతులు ఒలకబోస్తున్నారు. అప్పుడేమో పొగడ్తల్లో ముంచి, ఇప్పుడేందుకు గంగవెర్రులు? భుజంభుజం కలిపి భాయి భాయి అనుకున్నప్పుడు ఒక లెక్క, ఎన్నికల్లో మరోలెక్కా!? ఇదేమీ చోద్యం. మంచిని మంచి అనే చెప్పాలి. చెడుని చెడనే అనాలి. సత్యం ఉనికిలో ఉండాల్సిందే. ఆదిశగా అందరూ నడవాల్సిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై ఎన్‌డీఎస్‌ఏ ఎలాంటి విచారణ లేకుండానే, కేవలం రెండు రోజుల పరిశీలనతోనే తుది నిర్ణయానికి వచ్చిదంటూ కేసీఆర్‌ సర్కారు అగ్గి మీద గుగ్గీలం అవుతున్నది. సమగ్ర వివ రాలతో గట్టిగానే కేంద్రానికి లేఖ రాసింది.
ప్లానింగ్‌, డిజైన్‌, క్వాలిటీ, మెయింటె నెన్స్‌లో ఏ ఒక్కదాన్ని పాటించలేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్‌డిఎస్‌ఏ తప్పు బట్టింది. కాళేశ్వరం పిల్లర్ల కింద బేస్‌ మెంటు నిర్మాణం సరిగ్గా జరగలేదనీ, అందుకే ఇసుక కొట్టుకుపోయి పగుళ్లు, బుంగలు వస్తున్నాయనేది తాత్కాలిక అంచనా. అలాగే సాంకేతిక వైఫల్యాలూ ఎన్నో. కాఫర్‌డ్యామ్‌, రింగ్‌మెయిన్‌ నిర్మాణం తర్వాతగానీ కచ్చితమైన లోపాలను గుర్తించలేమని రాష్ట్ర సాగునీటిశాఖ వాదన. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల్‌శక్తి శాఖ సాంకేతిక సలహాకమిటీ 2018, జూన్‌ ఆరున గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. దీన్ని డ్యామ్‌ సేఫ్టీ జాబితాలో చేర్చింది ఈ ఏడాది జులై పన్నెండునే. గత మూడేండ్లుగా వరుసగా వచ్చిన వరదల మూలాన నిర్వ హణ చేయలేకపోయామంటున్న సాగునీటిశాఖ, నివేదికలు చూడకుండానే నిందలు మోపడమేంటని కేంద్రాన్ని ప్రశ్ని స్తున్నది. ఇన్స్‌ఫెక్షన్‌, కంప్టేషన్‌ క్వాలిటీ, ధర్డ్‌ఫార్టీ, భౌగోళిక సమా చారం, వర్షాకాలం ముందు, తర్వాత నది కొలతలను చూ పించే స్టక్చరల్‌ డ్రాయింగ్‌ల సమాచారం ఇవ్వలేదని ఎన్‌డిఎస్‌ఏ ఆరోపణ. రాజకీయ దురుద్దేశ్యంతోనే మేడిగడ్డ నివేదికను ఎన్నికల సమయంలో మోడీ సర్కారు ఇచ్చిదంటూ సీఎం కేసీఆర్‌ తనయుడు, మంత్రి కేటీఆర్‌ సెలవిస్తున్నాడు. అంతేగాక రూ. 1.26 లక్షల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు మూడు వరదకాలాలను తట్టుకుని నిలబడిదంటూ సమర్థించు కుంటున్నారు కూడా.
ఇందుకు 1980లో ప్రకాశం బ్యారేజీ, పశ్చిబెంగాల్‌లోని ఫర్కా బ్యారేజీలోనూ ఇదే జరిగిందంటూ కేటీఆర్‌ ఎదురుదాడికి దిగారు. పోల వరంలో ఢయాఫ్రం వాల్‌ విఫల మైతే, రెండేండ్లుగా రిపోర్టు ఎందుకివ్వలేదంటూ ప్రశ్నిస్తున్నారు. బ్యారేజీని తెలియాడే నిర్మాణంగా డిజైన్‌ చేశారు. కానీ స్థిరమైన కట్టడంగా నిర్మిం చారు. వీటిని పరిశీలిస్తే ప్లానింగ్‌ చేసినట్టుగా డిజైన్‌ లేకపోవడం, డిజైన్‌ చేసినట్టుగా నిర్మాణం చేయకపోవడం సమస్యకు మూలంగా కనిపిస్తున్నది. గడిచిన నాలుగేండ్లల్లో మేడిగడ్డ నుంచి 154 టీఎంసీలు ఎత్తిపోస్తే, అందులో దాదాపు 100 టీఎంసీలు వినియోగంలోకి రాలేదు. దీనికి కారణాలు స్పష్టంగా కండ్లముందే ఉన్నాయి. గోదావరి నదిపై గొలుసుకట్టు నమూ నాలో బ్యారేజీలను నిర్మించారు. మేడిగడ్డ, దానిపైభాగంలో అన్నారం, ఆ దానిపైన సుందిళ్ల, దాన్నుండి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయడం, ఈలోపు గోదావరి నదికి వరదరావడంతో మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తి పోసిన నీళ్లు, వరద ప్రవాహంతో కలిసి ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి కిందికి ప్రవహించి, మేడిగడ్డ మీదుగా సముద్రంలోకి వెళ్లిపోవడం జరిగింది.
గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్టుగా గతేడాది మేడిగడ్డ పంపుహౌజ్‌ గోదావరి వరద నీటిలో మునిగింది. తాజాగా అసలు ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థమయ్యే పరిస్థితి. ఈ దుస్థితి తలెత్తడానికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండింటి బాధ్యత కాదా? ఒకరిపై మరోకరు అరోపణలు, విమర్శలు చేసుకో వడం ద్వారా జనం దృష్టిని మళ్లించాలనుకుంటున్నారా? ఎన్నికల నేపథ్యంలో రాజకీయ దాగుడుమూతలా?.ఈ రెండు ప్రభు త్వాలు ‘నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేసా’్త అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ ఒక్కమాట కూడా మాట్లాడక పోవడం విచారకరం. ప్రస్తుతం రెండు రిజర్వా యర్ల నుంచి నీటిని వదిలేశారు. వచ్చే ఎండాకాలంలో తాగు, సాగు నీటి సమస్య ఉత్పన్నం కావచ్చు. దీని గురించి పట్టింపు ఏమైనా ఉందా? ప్రజల ప్రాణాలు, ఆస్తులకు బాధ్యత ఎవరిది? ఆర్థిక నష్టాలను నిర్మించిన కంపెనీ నుంచే పూడ్చుకోవాలి. నేషనల్‌ డ్యామ్‌సేప్టీ చట్టం ప్రకారం బాధ్యు లెవరైనా సరే, వారిని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Spread the love