సీపీఎస్‌ రద్దుపై రాజకీయ పార్టీలు స్పష్టతనివ్వాలి

– పాత పెన్షన్‌ పునరుద్ధరణపై మ్యానిఫెస్టోలో చేర్చాలి : ఎన్‌ఎంఓపీఎస్‌ సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దుపై స్పష్టమైన హామీ ఇచ్చి పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌) పునరుద్ధరణపై మ్యానిఫెస్టోలో చేర్చాలని నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఎన్‌ఎంఓపీఎస్‌) సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ, సీపీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, కోశాధికారి నరేష్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. అన్ని రాజకీయ పార్టీలూ సీపీఎస్‌ రద్దు-పాత పెన్షన్‌ పునరుద్ధరణ అంశాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించాలని వారు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
పాత పెన్షన్‌ విధానం అమలు కోసం దేశంలో ఉన్న 84 లక్షల సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు, తెలంగాణలో 2.30 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు సరైన విధంగా చేర్చి వారికి లబ్ధి చేకూర్చేలా చేసేది ఉద్యోగులేనని పేర్కొన్నారు.
2004 తర్వాత ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ వ్యతిరేకిస్తున్న సీపీఎస్‌ విధానాన్ని ప్రభుత్వాలు ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రూ.పది లక్షల కోట్లు ఉద్యోగుల, ప్రభుత్వ గ్రాంటు షేర్‌ మార్కెట్లో పెట్టుబడులుగా వెళ్లాయని వివరించారు. 84 లక్షల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించలేని పీఎఫ్‌ఆర్డీఏ చట్టం నుంచి ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ పార్టీలు ఈ చట్టంపై నిర్ణయం తీసుకుని మ్యానిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించాలని కోరారు.

Spread the love