పేపర్‌ లీకేజీలో రాజకీయం

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పూర్తి విచారణ జరిపి పక్కా ఆధారాలతో దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు నియమించిన సిట్‌ విచారణను వేగవంతం చేయడం మంచి పరిణామం. లీకేజీలో ఒకరిద్దరే కాదు ఎక్కువమంది ఉన్నారని సిట్‌ విచారణలో బయటకు వస్తున్నాయి. అయితే, ఈ సమయంలో లీకేజీ వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సమస్యను పక్కదారి పట్టించి మరింత జఠిలం చేస్తుండటం విచారకరం. దీనిని రాజకీయంగా వాడుకు నేందుకు జరుగుతున్న రాద్దాంతం సరైంది కాదు. ఆయా రాజకీయ పార్టీల నాయకుల ప్రకటనలు, ప్రభుత్వం, మంత్రులు, గవర్నర్‌ వ్యాఖ్యలు, వాటికి తోడు సిట్‌ అధికారుల నోటీసులు.. ఈ గొడవల మధ్య లీకేజీ వ్యవహారం తేలి.. సకాలంలో ఉద్యోగ నియామక పరీక్షలు జరుగుతాయా అన్నదే నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశం. ఎన్నికల సమయం కావడంతో ప్రస్తుత పరిణామాలు అంత తొందరంగా సమసిపోతాయా అన్నది ప్రశ్న.
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాలతోనే తెలంగాణ ఉద్యమం సాగి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిందని వేరే చెప్పన్కర్లేదు. రాష్ట్రం వస్తే ప్రభుత్వ కొలువులు వస్తాయని ఎంతోమంది ఆశపడ్డారు. రాష్ట్రం ఏర్పడినా ఆ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల నియమాకాలు జరగడం లేదన్న బాధ చాలామందిలో నేడు నెలకొంది. ఉద్యమకాలంలో నిరుద్యోగులకు ఆయా పార్టీల నాయకులు యువతలో భావోద్యేగాలను రాజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కంటే ఎక్కువ నియామకాలు జరిపినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. వాటికంటే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చామంటోంది. ఉద్యమ సమయంలో చెప్పినట్టు నియమాకాలు జరగలేదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇటీవల ప్రభుత్వం 90 వేల ప్రభుత్వ ఉద్యో గాలను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటిం చింది. 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీక రిస్తామని చెప్పింది. అందులో చాలా వాటికి ఆర్థికశాఖ అనుమతులిచ్చింది. వరుస నోటిఫికేషన్‌లు అనంతరం నాలుగైదు పరీక్షలను నియమించిన టీఎస్‌పీఎస్సీ ..తాజాగా టౌన్‌ ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌ పరీక్ష లీకేజీ కావడం రాజకీయంగా మరింత ఆజ్యం పోసింది.
టీఎస్‌పీఎస్సీలో ఉన్నవారే లీకేజీకి పాల్పడడంతో మొత్తం పరీక్షల మీదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీన్నుంచి బయట పడటం ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్‌ అని చెప్పవచ్చు. దీనిని పాలనా వైఫల్యంగా ప్రజలకు చూపెట్టాల్సిన ప్రతిపక్షపార్టీలు… కేసీఆర్‌ కుటుంబంపైనా, కేటీఆర్‌ కార్యా లయంపైనా ఆరోపణలు చేయడం వల్ల రాజకీయ లబ్ధికోసమే తాపత్రయపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాటిని మంత్రి కేటీఆర్‌ కూడా వ్యక్తిగతంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రులు కూడా సమస్యను పక్కదారి పట్టించకుండా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేపర్‌ లీకేజీలు జరిగిన మాట వాస్తవం. దానిని దృష్టిలో పెట్టుకుని లీకేజీలు కామన్‌ అని మంత్రులు అనడం సరికాదు. నిరుద్యోగులకు లాభం చేకూర్చాల్సింది పోయి ఇరువైపులా రాజకీయ విమర్శలు చేసుకోవడం వల్ల మేలు ఎవరికి జరుగు తుందన్నది ప్రశ్న. ఇదెదో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నేతల వ్యవహార మన్నట్టు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పార్టీల నాయకులు విద్యార్థుల భవిష్య త్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. – వేణుమాధవరావు

Spread the love