గోడలపై రాజకీయం

Politics on the walls– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల వాల్‌ పోస్టర్‌ వార్‌
– మూడు రంగులపై గులాబీ రంగులు
– ఎన్నికలకు ముందే హౌరాహౌరీ ప్రచారం
– తమ పెయింటింగ్‌లను అధికారపార్టీ చేరిపేయిస్తున్నదని కాంగ్రెస్‌ ఆరోపణ
– సోషల్‌మీడియాపైనే ప్రధాన పార్టీల దృష్టి
ఖమ్మంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వాల్‌పోస్టర్ల వార్‌ మొదలైంది. ఇరుపార్టీలు పోటాపోటీగా వాల్‌రైటింగ్స్‌ ప్రచారం మొదలుపెట్టాయి. విచ్చలవిడిగా స్టిక్కింగ్‌ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే ఇరుపార్టీలు హౌరాహౌరీగా ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. గోడలపై ఉన్న కాంగ్రెస్‌ వాటర్‌ పెయింట్‌లను చెరిపి వేసి ‘గులాబీ’ రంగులను పులుముతున్నారు. కార్పొరేషన్‌ సిబ్బంది మూడు రంగులను తొలగించి వెళ్లగానే గులాబీ కార్యకర్తలు అదేస్థానంలో మంత్రి పువ్వాడ అజరు పేరుతో ఫ్లెక్సీలను స్టిక్‌ చేస్తున్నారు. కానీ వీటి జోలికి కార్పొరేషన్‌ సిబ్బంది వెళ్లకపోవడం గమనార్హం. నగరంలోని పలు డివిజన్‌లలో నాలుగైదు రోజులుగా ఇదో తంతుగా కొనసాగుతోంది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ ఖమ్మంలో చేసిన పలు అభివృద్ధి పనుల దృశ్యాలతో కూడిన స్టిక్కింగ్‌ ఫ్లెక్సీలను బీఆర్‌ఎస్‌ రూపొందించింది. ‘మన ఖమ్మం.. మన అజయన్న’ పేరుతో తయారు చేసిన ఈ పోస్టర్లను ఇటీవల అతికిస్తోంది. అభివృద్ధి పేరుతో రూపొందించిన ఈ ఫ్లెక్సీల జోలికి కార్పొరేషన్‌ సిబ్బంది వెళ్లడం లేదు. కాంగ్రెస్‌ వాటర్‌ పెయింట్‌లను మాత్రం తొలగిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి దృశ్యాలు ఉన్నాయి కాబట్టి గులాబీ ఫ్లెక్సీలను తొలగించడం లేదని నగరపాలక సంస్థ సిబ్బంది చెబుతున్నారు. కానీ కాంగ్రెస్‌ నేతలు దీన్ని తప్పుబడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడుతున్నారు.
పురపాలక మంత్రి మాటలు పెడచెవిన..
ఖమ్మంలోని 40, 42తో పాటు పలు డివిజన్లు, ఉమ్మడి జిల్లాలోని వివిధ మున్సిపాల్టీలు, పలు ప్రాంతాల్లో వేసిన కాంగ్రెస్‌ వాటర్‌ పెయింటింగ్స్‌ను తొలగించి, గులాబీ వినయిల్‌ (ఫ్లెక్సీ స్టిక్కర్లు)ను వేస్తున్నారు. ఈ విషయమై ఆయా ప్రాంతాల్లో ఇరు గ్రూపుల మధ్య వివాదం నడుస్తోంది. పరస్పరం దూషించుకుంటున్నారు. అధికారం ఉందనే ఇలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
మున్సిపల్‌ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెక్సీలు, ప్లాస్టిక్‌ విషయంలో నెలకొంటున్న కాలుష్యంపై పురపాలకమంత్రి కేటీఆర్‌ మాటలను కూడా కార్పొరేషన్‌ సిబ్బందితో పాటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెడచెవిన పెడుతున్నాయని కాంగ్రెస్‌ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
ప్రచార సామగ్రికి భారీగా ఖర్చు..
ప్రచార సామగ్రికి ఆయా పార్టీలు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. అభ్యర్థులు ఎవరికి వారుగా సోషల్‌ మీడియా నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుంటున్నారు. కొందరు ఏకంగా ఫ్లెక్సీ మిషన్‌లను సైతం కొనుగోలు చేసి, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ప్రింటింగ్‌ వేయిస్తున్నారు. ప్రధాన మీడియా కన్నా కూడా సోషల్‌ మీడియాపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, షేర్‌చాట్‌ రీల్స్‌ తయారు చేయించి మరీ చక్కర్లు కొట్టిస్తున్నారు.
ప్రత్యర్థి వైఫల్యాలను ఎండగట్టే రీతిలో ఆసక్తికరమైన మీమ్స్‌ను సైతం రూపొందిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో లోపాలపై విపక్షాలు దృష్టి సారిస్తుండగా.. విపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు విస్మరించిన అభివృద్ధి పనుల దృశ్యాలను నాడు- నేడుగా అధికారపక్షం ప్రచారం చేస్తున్నది. గడప గడపకు కాంగ్రెస్‌ రూపంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి, సంక్షేమంపై ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే, ఈ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ ప్రచారం నిర్వహిస్తోంది. కాగా, ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు పడుతున్న ఈ ప్రయాసలపై జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Spread the love