– భట్టి, శ్రీధర్ బాబుతో సహా చార్జి తీసుకున్న పలువురు అమాత్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భాద్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తదితరులు హాజరయ్యారు. భువనగిరి జిల్లా రాయగిరిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ పొంగులేటి మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల డీపీఆర్‌ఓలకు అధునాతన కెమెరాలను అందజేసే ఫైల్‌తో పాటు. గహ నిర్మాణ శాఖకు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. పొంగులేటితో పాటు పలువురు మంత్రులు సైతం తమకు కేటాయించిన శాఖల బాద్యతలను స్వీకరించారు. ఆర్థిక, ప్రణాళికలు, ఇంధన శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగాదుద్దిళ్ళ శ్రీదర్ బాబు, పంచాయితీ రాజ్, గ్రామీణభివృద్ది, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ధనసరి అనసూయ (సీతక్క) భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహ పదవీ బాధ్యతలు స్వీకరించారు.