– ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ
– బీఆర్‌ఎస్ వైపు అడుగులు?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్‌కు పార్టీకి పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు శుక్రవారం పంపించారు. కాంగ్రెస్‌లో తనకు అవమానం జరిగిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ మంత్రివర్గంలో పొన్నాల మంత్రిగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. జనగామ టికెట్ విషయంలో అసంతృప్త్తితోనే ఆయన రాజీనామా చేసినట్టు తెలిసింది. పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘నాది 45 ఏండ్ల రాజకీయ జీవితం. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చా. 45 ఏండ్ల తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరంగా ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. నా విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు’ అని పొన్నాల అన్నారు.
జనగామ టికెట్
జనగామ టికెటు ఆశిస్తున్న పొన్నాల లక్ష్మయ్యకు ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కొమ్మ్మూరి ప్రతాపరెడ్డికి అధిష్టానం ఖరారు చేస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నది. పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే రెండుసార్లు అక్కడి నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన జనగామ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని పార్టీ దృష్టికి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో తప్ప ఆయన ప్రజా సమస్యలపై పనిచేయలేదనే విమర్శలున్నాయి. స్థానికంగా ఓటు కూడా నమోదు చేయించుకోలేదని స్థానిక నేతలు చెబుతున్నారు. వెరసీ ఆయనకు ఈసారి టికెటు ఇచ్చే పరిస్థితులు లేవంటూ పార్టీ నుంచి సంకేతాలు అందినట్టు తెలిసింది. ఈ కారణంగానే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పొన్నాల కాడిపడేశారు: బీసీ నేతల ఆగ్రహం
కాంగ్రెస్‌లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటూ ఉద్యమం మొదలు పెట్టిన పొన్నాల… ఇప్పుడు ఉన్నట్టుండి పార్టీ వీడటం సరైందికాదంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తును ఫణంగా పెట్టి ఆయన వెంట పోతే తమను నడిబజారులో వదిలేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఉండి బీసీలకు సీట్లు సాధించకుండా తన ఒక్కడి సీటు కోసం బీఆర్‌ఎస్‌లోకి పోతున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత కావడంతో పార్టీ అధిష్టానంతో సత్సంబంధాలు ఉండటంతో ఆయన వెంట నడుస్తామని చెప్పినప్పటికీ తమను సంప్రదించకుండానే రాత్రి రాత్రికి నిర్ణయం తీసుకుని పార్టీ మారడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు పొన్నాల దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సమయంలో పొన్నాల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పొన్నాలతో పాటే ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి. తన క్యాడర్‌తో చర్చించాకే పొన్నాల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.