పేద, సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితి

– దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టిన మోడీ
– యువతకు ఉద్యోగాలివ్వక రోడ్డున పడేశారు : అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
విద్య, వైద్యాన్ని, దేశ సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టిందని, సామాన్య ప్రజల జీవన విధానం దెబ్బతింటుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజరు విహార్‌ సమావేశ మందిరంలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశం 2వ రోజు కొనసాగింది. ముగింపు కార్యక్రమంలో వెంకట్‌ మాట్లాడారు.
పేద ప్రజలు ఆహార పదార్థాలను కొని తినే పరిస్థితి లేదని, దీనికి కారణం మోడీ ప్రభుత్వ విధానాలేనని చెప్పారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం అనేక రేట్లు పెరిగిందని, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉపాధిహామీ చట్టంలో 7 కోట్ల పని దినాలకు తగ్గించి కష్టజీవులు, బడుగులు బలహీన వర్గాల ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ప్రతి బడ్జెట్‌లోనూ ఉపాధి హామీచట్టానికి నిధులు తగ్గిస్తూ పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టానికి రెండు లక్షల అరవై వేల కోట్లు కేటాయించి, ఉపాధి కార్మికులకు భృతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు ప్రతిఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ యువతను నడిరోడ్డున పడేశారని విమర్శించారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం దళితులకు మూడెకరాలు భూమి ఇస్తామన్న హామీ విఫలమైందన్నారు. ధరల పెరుగుదల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. వ్యవసాయ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.
నాగార్జున కొండను సందర్శించిన కేంద్ర కమిటీ సభ్యులు
నాగార్జునసాగర్‌ విజయ విహార్‌లో రెండ్రోజులు జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. అనంతరం 22 రాష్ట్రాల ప్రతినిధులు నాగార్జునసాగర్‌లో లాంచ్‌పై వెళ్లి నాగార్జునకొండను సందర్శించారు. బుద్ధవనాలను సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అల్‌ ఇండియా అధ్యక్షులు విజయరాఘవన్‌, సహాయ కార్యదర్శులు శివదాసన్‌, విక్రమ్‌ సింగ్‌, కేంద్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వెంకట్‌ రాములు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్ప పద్మ, జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకట్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కంబాలపల్లి ఆనందు, కత్తుల లింగస్వామి, అవుత సైదయ్య, కుంకుమూరి కోటిరెడ్డి పాల్గొన్నారు.

Spread the love