అంగన్‌వాడీ ఉద్యోగులకు కరువైన ప్రభుత్వ ఆదరణ

– అబీఎస్పీ ధర్మపురి నియోజకవర్గ
– ఇన్‌చార్జి నక్క విజయ్ కుమార్‌
నవతెలంగాణ-వెల్గటూర్‌
అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీఎస్పీ ధర్మపురి నియోజకవర్గ ఇన్‌చార్జి నక్క విజయకుమార్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని త‌హ‌సీల్దా‌ర్‌ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న అంగన్‌ వాడీలకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. తొమ్మిది రోజుల నుంచి అంగన్‌వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందని విమర్శించారు. దేశంలో ఉన్న బడుగు బలహీన, పేద వర్గాల చిన్నారులు పౌష్టికాహర లోపంతో చనిపోతున్నారని, ఆనాడు రాజ్యాంగ వేత్తలు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ఆధారం గా అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే అంగన్‌వాడీ టీచర్లను, ఆయాలను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి, ఆశీర్వాద సభలు నిర్వహించుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. అంగన్‌వాడీలను పర్మినెంట్‌ చేసి రూ. 26,000 కనీస వేతనం, 60 సంవత్సరాలకే రిటైర్మెంట్‌, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా ఇచ్చి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యూటీని ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్‌ మండల అధ్యక్షుడు బచ్చలస్వామి, గొల్లపల్లి మండల అధ్యక్షుడు కల్లెపెల్లి తిరుపతి, నాయకులు చెన్న శ్రీనివాస్‌, బచ్చల శైలెందర్‌, సంగెపు శేఖర్‌, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి బచ్చల పాల్గొన్నారు.

Spread the love