– దిగుబడి రాక ఆవేదన చెందుతున్న రైతులు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తరుణంలో అన్నదాతలు ఇతర పంటల వైపు మొగ్గు చుపుతున్నారు. అందులో ప్రధానమైనది బత్తాయి సాగు. నల్గొండ జిల్లాలో బత్తాయి సాగు విరివిగానే ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకున్న కొన్ని యూనివర్సిటీలు, ఒప్పంద సంస్థలు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాయి. నాసిరకమైన మొక్కలు అందజేస్తుండటం రైతులకు శాపంగా మారింది. నాణ్యత ప్రమాణాలతో అందజేయాల్సిన మొక్కలు చీడపీడలతో కూడినవి ఇస్తూ రైతుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. యూనివర్సిటీలు, కంపెనీల తీరుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్లు చూస్తున్నారనే విమర్శలున్నాయి. దీనికి తోడు మొక్కలు అందేందుకు సంవత్సరాల కొలది సమయం పడుతుండటంతో నిరీక్షణ పెద్ద సమస్యగా మారింది.
తీవ్రంగా నష్టపోతున్న రైతులు..
నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగుతో అధికదిగుబడి రాక రైతులు భారీగా నష్టాలు చవిచూస్తే పరిస్థితి ఏర్పడుతుంది. బత్తాయి సాగు లాభసాటిగా అయినప్పటికీ దిగుబడి రాక రైతాంగం అనేక నష్టాలను చవిచూస్తుంది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెం గ్రామంలో రైతు గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఏడేండ్ల క్రితం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ మహానంది రీసెర్చ్ సెంటర్ నుండి బత్తాయి మొక్కలు తెచ్చి సాగు చేశారు.ఏడేండ్లుగా ఎలాంటి పూత, కాత లేదు.దిగుబడికి నోచుకోక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.దీంతో అప్పుల ఊబిలో చిక్కిపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం తన తోటను సందర్శించిన హార్టికల్చర్ బృందానికి తోట సాగులో ఎదుర్కుంటున్న ఇబ్బందులను పూర్తిగా వివరించారు. తను ఏడేండ్లుగా సుమారుగా రూ.28 లక్షలు నష్టపోయాయనని వాపోయారు.అనంతరం సైంటిస్ట్ బృందం తోటను పరిశీలించి బాధితరైతు ప్రధానంగా కాయ సైజు రాకపోవడం, కాయ పసుపురంగలోకి మారి రాలిపోవడం వంటివి సమస్యలను తీసుకువచ్చాడని అవి వాస్తవమేనని తెలిపారు.వీటిపై మా బృందం క్షణ్నంగా పరిశీలించి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అనంతపురం రీసెర్చ్ స్టేషన్ నుండి రైతు కు అందించిన బత్తాయి రకంపై మీడియామిత్రులు అనంతపురం రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్టు సుబ్రహ్మణ్యంను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా హార్టికల్చర్ అధికారిణి సంగీతలక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పడిన హార్టికల్చర్ బృందం, మహానంది రిసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ ముత్యాలనాయుడు, కొండమల్లేపల్లి రిసెర్చ్ స్టేషన్ హెచ్ ఓ డి రాజాగౌడ్, హార్టికల్చరిస్టు డాక్టర్ జ్యోతి పాల్గొన్నారు.
మా అనంతపురం రీసెర్చ్ స్టేషన్ నుండి రైతుకు అందించిన బత్తాయి రకంలో(రంగాపూర్ సాతుగుడి) జాతిలో సమస్యల్లేవు.బేసికల్‌గా రంగాపూర్ రకం సాగు చేసిన 8 ఏండ్ల తర్వాత దిగుబడి వస్తుంది. అనవసరంగా రైతు ఆందోళన చెందుతున్నాడు.రైతు చెప్పే సమస్యలకు ఇప్పటికిప్పుడు మా వద్ద సమాధానం లేదు.
గతంలో ఎక్కడా ఈసమస్య ఉత్పన్నం కాలేదు: సంగీతలక్ష్మి (నల్లగొండ జిల్లా హార్టికల్చర్ అధికారిణి )
గతంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఈసమస్య ఉత్పన్నం కాలేదు.ఈ సమస్య రెండుమూడేండ్లగా బాగా తీవ్రతరమవుతుంది. విషయాన్ని రైతు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే సంబంధిత సైంటిస్టులను సంప్రదించి పరిష్కారానికి కృషి చేస్తున్నాం.బత్తాయి రైతు గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఎదుర్కుంటున్న సమస్యకు మా వద్ద పరిష్కారం లేదు.అందుకే హార్టికల్చర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు బత్తాయితోటను పరిశీలించాం.సత్వరమే సమస్యకు పరిష్కారం చూపిస్తాం.
డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ (తిరుపతి) యూనివర్శిటీ మొక్కల జోలికి అసలే పోవద్దు: గుర్రం శ్రీనివాస్‌రెడ్డి (బాధిత రైతు)
నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగుకు మిగతా రైతులు ఆసక్తి చూపొద్దని బత్తాయిరైతు గుర్రం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.బత్తాయి రైతులకు నాణ్యమైన మొక్కలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రికల్చర్ రిసెర్చ్ స్టేషన్‌లే అందించలేని పరిస్థితి ఉంది.డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్స్ యూనివర్సిటీ అనుబంధ రిసెర్చ్ సెంటర్ల నుండి ఎలాంటి మొక్కలను రైతులు కొనుగోలు చేయవద్దు. గత ఏడేండ్ల కింద కొనుగోలు చేసిన రైతుగా, ఆర్థికంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బత్తాయి సాగు చేశామంటే కోరి నష్టాలను కొని తెచ్చుకున్నట్లే అన్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా పరిధిలో తిరుపతియూనివర్శిటీ, అనుబంధ సంస్థలైన మహానంది రీసెర్చ్ స్టేషన్, అనంతపురం రిసెర్చ్ స్టేషన్, వెంకటగిరి రిసెర్చ్ స్టేషన్, తిరుపతి రిసెర్చ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా మొక్కలు కొనుగోలు చేసి బత్తాయి సాగు చేసి ఇబ్బందులకు గురైతున్నట్టయితే తన మొబైల్ నెంబర్ 9490099043 ను సంప్రదించాలని కోరారు.ఈ సమస్యలపై మనమంతా ఏకమై సమిష్టిగా పోరాటం చేద్దామని రైతులను కోరారు.ఇప్పటికే నల్లగొండ జిల్లాలో తిప్పర్తి, మాడుగుల పల్లి, నల్లగొండ, నిడమనూరు, ముషంపల్లి ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు సుమారు 40 మంది రైతులు నేరుగా తనకు టచ్‌లో ఉన్నారని ఇంకా ఎవరైనా ఉంటే తనను సంప్రదించవచ్చని తెలిపారు.