నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు సినీ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన రాజ్-కోటి సంగీత ద్వయంలో రాజ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంగీత ప్రపంచంలో రాజ్-కోటి ద్వయం ప్రఖ్యాతిగాంచింది. దశాబ్దాలపాటు ఈ ద్వయం సినీప్రియులను తమ సంగీతంతో అలరించింది. రాజ్ మరణంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు. రాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్-కోటి ద్వయం ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించింది. దాదాపు 150కు పైగా చిత్రాలకు వీరు పనిచేశారు. ‘ముఠామేస్త్రి’, ‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ ‘హలోబ్రదర్’ వంటి చిత్రాలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అనుకోని కారణాల వల్ల కోటి నుంచి విడిపోయిన రాజ్ సొంతంగా కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు. ‘సిసింద్రీ’, ‘రాముడొచ్చాడు’, ‘ప్రేమంటే ఇదేరా’ (నేపథ్య సంగీతం) ఇలా తదితర సినిమాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. కొన్ని సినిమాల్లో ఆయన అతిథి పాత్రల్లోనూ కనిపించారు.