ప్రముఖ టాలీవుడ్ నటుడు మృతి

నవతెలంగాణ- హైదరాబాద్: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. మిచిగాన్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లిన ఈశ్వరరావు అక్టోబర్‌ 31న తుదిశ్వాస విడిచారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘స్వర్గం నరకం’ చిత్రం ద్వారా ఈశ్వరరావు, మోహన్‌ బాబు చిత్రసీమకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే హిట్‌ అందుకున్న ఆయన కాంస్య నంది అవార్డును అందుకున్నారు. ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్‌ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్‌ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. దాదాపు 200లకు పైగా సినిమాలతోపాటు టీవీ సీరియళ్లలోనూ ఆయన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణంలో తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

Spread the love