– ఓయూ వీసీ రవీందర్
– పోస్టల్ ఉద్యోగులకు రీజినల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానం
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో పోస్టల్ శాఖ విస్తృతమైన సేవలు అందిస్తోందని ఓయూ వీసీ రవీందర్ అన్నారు. తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రీజినల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ఓయూ క్యాంపస్‌లోని జామై ఉస్మానియా పోస్ట్ ఆఫీస్ ఆవరణలో నిర్వహించారు. బాధ్యతలో ప్రతిభ చూపి, విధులు సక్రమంగా నిర్వహించి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ సేవలు అందించడంలో ముందంజలో ఉన్న రాష్ట్ర వ్యాప్త పోస్టల్ ఉద్యోగులకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓయూ వీసీ మాట్లాడుతూ.. ప్రతి పోస్ట్ ఆఫీసు దాదాపుగా 250 సేవలు అందిస్తోందన్నారు. కస్టమర్లు పోస్ట్ ఆఫీసుకు రాకుండా పోస్ట్‌మ్యాన్ లేదా జీడీఎస్ ద్వారా ఇంటి వద్దనే 160 సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సర్వీస్‌లను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె.ప్రకాష్ మాట్లాడుతూ.. పోస్టల్ శాఖ సేవలకు హైదరాబాద్ నగరం, జిల్లాలు, గ్రామాల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన 31 మందికి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ సాయి పల్లవి, జనరల్ పోస్ట్ మాస్టర్ హెచ్.ఆర్ విద్యాసాగర్, కె.ఏ.దేవరాజ్, డీటీఎస్, ఉద్యోగులు పాల్గొన్నారు.