డీఎస్సీ వాయిదా

Postponement of DSC– అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం
– ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ యథాతథం
– ఈనెల 21 వరకు తుదిగడువు
– ఇప్పటి వరకు 80 మంది దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) రాతపరీక్షలు వాయిదా పడ్డాయి. వచ్చేనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉంటుందని ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో అదేనెల 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో జరిగే రాతపరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ప్రకటించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే డీఎస్సీ రాతపరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. డీఎస్సీ రాతపరీక్షలు వాయిదా పడినా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. వాటి సమర్పణకు ఈనెల 21 వరకు తుదిగడువు ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 80 వేల దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ సప్టెంబర్‌ ఎనిమిదో తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. గతనెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చేనెల 20,21 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ అన్ని సబ్జెక్టులకు, అదేనెల 22న స్కూల్‌ అసిస్టెంట్‌ అన్ని లాంగ్వేజ్‌ సబ్జెక్టులకు, 23న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) అభ్యర్థులకు, 24న లాంగ్వేేజ్‌ పండితులకు, 25 నుంచి 30 వరకు ఆరు రోజులపాటు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) అభ్యర్థులకు రాతపరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికల పోలింగ్‌ వచ్చేనెల 30న ఉండడంతో డీఎస్సీ రాతపరీక్షలు అనివార్యంగా వాయిదా పడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో వచ్చేనెల రెండు, మూడు తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 రాతపరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వాయిదా వేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి ఆరు, ఏడు తేదీల్లో తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది.

Spread the love