– నవంబర్ 30న పోలింగ్..అదే రోజు ఎస్జీటీ పరీక్ష
– అన్ని పరీక్షలా? ఆ ఒక్కటే వాయిదానా
– విద్యాశాఖ సమాలోచనొ నేడు నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు వాయిదా పడే అవకాశమున్నది. నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో ఈ రాతపరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్ 30న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ రాతపరీక్షలు వాయిదా వేయడం తప్పనిసరి కానుంది. అయితే నవంబర్ 30న నిర్వహించే ఒక్కటే పరీక్షను వాయిదా వేస్తారా?, లేదంటే అన్ని పరీక్షలనూ వాయిదా వేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై విద్యాశాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం డీఎస్సీ రాతపరీక్షలన్నీ వాయిదా పడే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే నవంబర్ 30న పోలింగ్ ఉంటుంది. అంతకంటే వారం, పది రోజుల ముందు నుంచి ఎన్నికల కసరత్తు ప్రారంభమవుతుంది. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులే ఉంటారు. వారంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లిపోతారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు, పోలీసుల భద్రత ఇవన్నీ అదే సమయంలో జరుగుతాయి. ఇంకోవైపు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారంలో ఉంటారు. ఉపాధ్యాయ అభ్యర్థులు చదువులపై శ్రద్ధ పెట్టేందుకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంకోవైపు డీఎస్సీ రాతపరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లు, పోలీసుల భద్రత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆన్‌లైన్‌లో రాతపరీ క్షలు కాబట్టి పోలింగ్ కేంద్రాలకు,
ఈ పరీక్షా కేంద్రాలకు ఇబ్బంది ఉండదు. కానీ అటు ఎన్నికలు, ఇటు డీఎస్సీ రాతపరీక్షల నిర్వహణ ఇబ్బందికరంగా మారనుంది. అందుకే వాయిదా వేసేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోలింగ్ తేదీని ప్రకటించిన విషయాన్ని, డీఎస్సీ రాతపరీక్షలకు వస్తున్న ఇబ్బందులను నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారమే పంపించినట్టు తెలిసింది. దీనిపై మంగళవారం నిర్ణయం వెలువడే అవకాశమున్నది.
దరఖాస్తులు నామమాత్రమే…
ఉపాధ్యాయ పోస్టులకు నామమాత్రంగా దరఖాస్తులొస్తున్నాయి. ఎక్కువ మంది దరఖాస్తు చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ఇప్పటి వరకు 59 వేల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. వాటి సమర్పణకు ఈనెల 21 వరకు తుదిగడువు ఉన్నది. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ ఎనిమిదో తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 20,21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టుల రాతపరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. అదేనెల 22న స్కూల్ అసిస్టెంట్ అన్ని లాంగ్వేజ్ సబ్జెక్టుల పరీక్షలుంటాయి. 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) అభ్యర్థులకు ఒకే విడతలో పరీక్షను నిర్వహిస్తుంది. 24న లాంగ్వేేజ్ పండితులకు పరీక్ష ఉంటుంది. 25 నుంచి 30 వరకు ఆరు రోజులపాటు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) అభ్యర్థులకు రాతపరీక్షలను రోజూ రెండు విడతల్లో నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న ఉండడంతో డీఎస్సీ రాతపరీక్షలు సజావుగా జరిగే అవకాశం లేదని తెలుస్తున్నది. వాయిదా పడతాయని సమాచారం.