కాళేశ్వరంతో నిండు కుండలా చెరువులు

– కేసీఆర్ తో ప్రతీ రైతుకు భరోసా

– రాష్ట్ర మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ – చిన్నకోడూరు 
నాడు తెలంగాణలో కైకిలి దొరకని పరిస్థితి, కానీ నేడు తెలంగాణలో కైకిలోళ్లు దొరకని పరిస్థితి నెలకొన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో రైతు వేదిక, బుడగ జంగాల కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయితీ భవనం, మహిళా మండలి భవన్, మురికి కాల్వల నిర్మాణ పనులకు జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపిపి కూర మాణిక్యరెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు నెలలోపు రైతులందరికీ లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తామని చెప్పారు. బావులకు మీటర్లు పెడతామని బీజేపీ, మూడు గంటలే కరెంటు చాలని కాంగ్రెస్ చెబుతుంటే.. మీకు వెన్నంటే నేనున్నానని ధైర్యంగా మూడు పంటలు పండించాలని రైతులకు సీఎం కేసీఆర్ ధీమా ఇస్తున్నారని, ఆయన్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అంతకు ముందు పీఏసీఎస్ చైర్మన్ ముల్కల కనకరాజు పొలంలో 4 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగుకై మొక్కలు నాటారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి ఇతోధికంగా గ్రామ వీఓఏలు రూ.1016 విరాళంగా అందించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుకు ఏలాంటి తిప్పలు లేవని, కేసీఆర్ తో ప్రతీ రైతుకు భరోసా దొరికిందని రాష్ట్ర మంత్రి హరీశ్ వెల్లడించారు. కష్టపడి కాళేశ్వరం కట్టి కాల్వ తీస్తే ఇబ్రహీంనగర్ పెద్ద చెరువు నిండిందని, 30 ఏళ్ల నుంచి చెరువు నిండగా చూడని మీరు ఇగ బతికున్నంత కాలం ఎండగా చూడరని స్పష్టం చేశారు. ఇబ్రహీంనగర్-మందపల్లి పెద్దవాగు పై 6 వరకూ చెక్ డ్యాములు నిర్మించుకోవడంతో యేటా 10సార్లు చెక్ డ్యాములు పొంగుతున్నాయని ఇదే మనం సాధించిన గొప్పమార్పుగా చెప్పుకొచ్చారు. ఇబ్రహీంనగర్ లో గతేడాది వానాకాలం1682 ఎకరాలు, ఈ యాసంగిలో 1890 ఎకరాల వరినాట్లు వేశారని, గ్రామంలో 15 మంది రైతు కుటుంబాలకు రైతుభీమా అబడించినట్లు తెలిపారు. ఢిల్లీ నగరం, ఇతర రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని చెప్పారు. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం మారిందని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పండించిన బియ్యం కావాలని కోరుతున్నారని వెల్లడించారు. ఆయిల్ ఫామ్ సాగు విరివిగా చేసేందుకు రైతులు ముందుకొస్తే ప్రభుత్వం తరపున సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఎక్కడికెళ్లినా సిద్ధిపేట అంటే మీ గౌరవం, ప్రతిష్ట పెంచానని, ఈ గౌరవం, ప్రతిష్ట మీరిచ్చిందేనని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీదేనని, ఎన్నికలంటే ఐదేళ్లకోసారి వచ్చే వాళ్ళ మోజు, మాయలో పడొద్దని, మీ కష్టాల్లో ఎప్పుడూ మీ వెంట ఉంటున్న నన్ను ఆశీర్వదించాలని, నాపై మీ ప్రేమ, ఆదరాభిమానాలు కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజల కోరిక మేరకు కావాల్సిన పనులు వెంటనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love