పేదరికం తగ్గిందట !

Poverty is reduced!– కాకి లెక్కలు చెబుతున్న మోడీ ప్రభుత్వం
–  దారిద్య్ర రేఖ అంచనాలే లోపభూయిష్టం ఎవరి గణాంకాలు వారివే
మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ బీజేపీ హయాంలో గత ఐదు సంవత్సరాల కాలంలో దేశంలోని 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పుకొచ్చారు. ఇందులో వాస్తవం ఏ మాత్రం లేకపోయినా ఎన్నికలు సమీపిస్తున్న వేళ…పేదరిక నిర్మూలనలో తామే ఛాంపియన్లమని ప్రకటించుకునేందుకు బీజేపీ నేతలు తహతహలాడుతున్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కూడా పేదరిక నిర్మూలనపై ఇలాంటి ప్రకటనలే చేసింది. యూపీఏ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో దేశంలోని 14 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి పొందారని ఆ పార్టీ నేతలు గొప్పలు పోయారు. అయితే బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రకటనలు నేతి బీరకాయలో నెయ్యి చందమేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
న్యూఢిల్లీ : స్వాతంత్య్రానంతరం పేదరి కాన్ని అధికారికంగా అంచనా వేసిన సంద ర్భాలు చాలా తక్కువ. 2021 తర్వాత పేదరికంపై మన దేశంలో ఎలాంటి అంచనాలు వేయలేదు. పేదరికం నిర్వచనంలో, దాని కొలమానంలో కాలానుగుణంగా అనేక మార్పులు చేశారు. దీంతో గత ప్రభుత్వాలతో పోల్చి పేదరికాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది.
కేలరీల ఆధారంగా…
1962లో ప్రభుత్వ కార్యాచరణ బృందం దారిద్య్ర రేఖను నిర్ణయించేందుకు తొలి ప్రయత్నం చేసింది. అందుకోసం సమతుల ఆహారంపై భారత వ్యవసాయ పరిశోధనా మండలి చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంది. తొలి దారిద్య్ర రేఖను గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.20గా, పట్టణ ప్రాంతాలలో రూ.25గా నిర్ణయించింది. దీనిని ప్రభుత్వం అధికారికంగా కాక పోయినా విస్తృతంగానే ఉపయోగించుకుంది. 1971లో ఆర్థిక వేత్తలు వీఎన్‌ దండేకర్‌, ఎన్‌.రథ్‌ స్వతంత్రంగా దారిద్య్ర రేఖపై అధ్యయనం జరిపారు. రోజుకు కనీసం 2,250 కేలరీల శక్తి పొందేందుకు అయ్యే కనీస వ్యయాన్ని పరిగణనలోకి తీసుకు న్నారు. ఆ తర్వాత భవిష్యత్తులో వేసిన దారిద్య్ర రేఖ అంచనాలకు అదే ప్రాతిపదిక అయింది. ఆ ఇరువురు ఆర్థికవేత్తలు దారిద్య్ర రేఖను గ్రామీణ ప్రాంతాలలో రూ.15గా, పట్టణ ప్రాంతాలలో రూ.22.5గా నిర్ణయించారు. 1979లో వైకే అలఫ్‌ు నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ దారిద్య్ర రేఖను నిర్ణయించిన తర్వాత మన దేశంలో అధికారికంగా పేదరికంతో జీవిస్తున్న వారి సంఖ్యను లెక్కించడం ప్రారంభమైంది. వయసు, లింగం, వృత్తి ఆధారంగా సగటు కేలరీల అలవెన్సులను ఉపయోగించి రోజుకు కనీస కేలరీల అవస రాన్ని గ్రామీణ ప్రాంతాలలో 2,400గా, పట్టణ ప్రాంతాలలో 2,100గా నిర్ణయించారు.
పరిమితం…పరస్పర విరుద్ధం
2010లో ఐరాస అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్‌ఫర్డ్‌ సంస్థ కలిసి వివిధ కోణాలతో కూడిన దారిద్య్ర రేఖను (ఎంపీఐ) నిర్ణయించాయి. దీనిని 2021లో కొన్ని సవరణలతో మన దేశం అమలు చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం బహళ కోణాలతో కూడిన దారిద్య్ర రేఖను ప్రతి ఐదు సంవత్స రాలకు ఒకసారి సేకరించే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధా రంగా నిటి ఆయోగ్‌ అంచనా వేస్తోంది. పేదరికాన్ని అంచనా వేసేందుకు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న సమాచారం పరిమితంగా ఉండడమే కాకుండా పరస్పర విరుద్ధంగా కూడా ఉంటోంది. ఉదాహరణకు నిటి ఆయోగ్‌ ఎంపీఐ ప్రకారం 2004-05లో దేశ జనాభాలో 53.7శాతం పేదలే. అయితే అంతర్జాతీయ ఎంపీఐ మాత్రం ఈ సంఖ్యను 55.1%గా చూపింది. 2004-05 నుండి 2019-21 మధ్యకాలంలో దేశంలో 42 కోట్ల మంది పేదలు ఉన్నారని జాతీయ ఎంపీఐ చెబుతుంటే 41.5 కోట్ల మంది ఉన్నారని అంతర్జాతీయ ఎంపీఐ అంటోంది. టెండుల్కర్‌ నిపుణుల బృందం అంచనా ప్రకారం 2004-05 నుండి 2011-12 వరకూ దేశంలో 13.8 కోట్ల మందిని పేదరికం నుండి బయటపడేశారు. 2019-21 సమాచారం ప్రకారం దేశంలోని పేదలలో అత్యధికులు బీహార్‌ వాసులే. అక్కడి జనాభాలో 34శాతం మంది పేదరికంలో జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని జనాభాలో పేదల సంఖ్య 10శాతం కంటే తక్కువేనని ప్రభుత్వం చెబుతోంది. 2015-16 నుండి 2019-21 మధ్య కాలంలో బీహార్‌లో పేదరికం 18 శాతం పాయింట్లు తగ్గిందట. దేశంలో వెనుకబడిన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిసాలో కూడా పేదరికం గణ నీయంగా తగ్గిందని ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోంది. అయితే నిటి ఆయోగ్‌ ఎంపీఐ, అంతర్జాతీయ ఎంపీఐ మధ్య పేదరిక రేట్లలో తేడాలు ఉన్నాయి. ఎందుకంటే వాటిలో దారిద్య్ర రేఖను లెక్కించే పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. అనేక రాష్ట్రాలలో జాతీయ ఎంపీఐ కంటే అంతర్జాతీయ ఎంపీఐ సుమారు రెండు శాతం పాయింట్లు ఎక్కువగా ఉంది. ఒడిసాలో అయితే ఈ వ్యత్యాసం ఐదు శాతం, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లో మూడు శాతం పాయింట్లుగా నమోదైంది.
ఆహార, ఆహారేతర వ్యయాల ఆధారంగా…
2014లో రంగరాజన్‌ కమిటీ టెండుల్కర్‌ నిర్ణయించిన దారిద్య్ర రేఖను సవరించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వినియోగ వ్యయాన్ని వేరు చేసింది. సిఫార్సు చేసిన కేలరీలు, ప్రొటీన్‌, ఫ్యాట్‌ను అందించే ఆహార పదార్థాలతో పాటు బట్టలు, విద్య, ఆరోగ్యం, నివాస గృహం, రవాణా వంటి ఆహారేతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. 2011-12 ధరలను బట్టి దినసరి తలసరి వ్యయాన్ని గ్రామీణ ప్రాంతాలలో రూ.32, పట్టణ ప్రాంతాలలో రూ.47గా నిర్ధారించారు.
లోపభూయిష్ట విధానాలు
దారిద్య్ర రేఖను నిర్ణయిస్తున్న విధానాలపై అనేక విమర్శలు వచ్చాయి. కేలరీల వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని కనీస జీవన ప్రమాణాన్ని అంచనా వేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఖర్చుకు సంబంధించి అనేక కుటుంబాలు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నప్పటికీ కనీస కేలరీల అవసరాలు నెరవేర్చలేకపోతున్నాయి. కాబట్టి కేలరీల ఆధారిత దారిద్య్ర రేఖ ప్రాంతీయ వైరుధ్యాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవడమే కాకుండా పేదరికం, దాని ప్రభావాలకు సంబంధించిన వివిధ కోణాలను స్పృశించలేకపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు.
గుజరాత్‌లో పెరుగుతున్న గరీబీ బీపీఎల్‌ కార్డులు వాడుతున్న కుటుంబాల సంఖ్య పైపైకి
– జాబితాలో 31 లక్షల కుటుంబాలు
– సామాజిక, ఆర్థికవేత్తల ఆందోళన
– ప్రధాని మోడీ స్వంత రాష్ట్రంలో ఇదీ పరిస్థితి
– ఈ సంఖ్య రాష్ట్ర జనాభాలో మూడో వంతు తీవ్ర పేదరికంలో 16.28 లక్షల కుటుంబాలు
గాంధీనగర్‌ : ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్‌లో పేదరికం పెరిగిపోతున్నది. అక్కడ బీపీఎల్‌ కార్డులు వాడుతున్న కుటుంబాల సంఖ్య అధికమవుతున్నది. గుజరాత్‌ రాష్ట్ర జనాభాలో దాదాపు మూడో వంతు మంది అంటే 31 లక్షల కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువ(బీపీఎల్‌)న ఉన్నాయి. దారిద్య్ర రేఖను గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 816గా లేదా రోజుకు రూ.32గా, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 1000గా లేదా రోజుకు రూ.26గా అంచనా వేసి లెక్కగట్టారు. రాష్ట్రంలో పేదరికం పరిస్థితులపై సాక్షాత్తూ గుజరాత్‌ సర్కారు ఆ రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించింది.రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తుషార్‌ చౌదరీ గతనెల 14న అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బచుభారు మగన్‌భారు ఖాబద్‌ సమాధానాన్ని వెల్లడించారు.
రాష్ట్ర మంత్రి తెలిపిన సమాధానం ప్రకారం.. గుజరాత్‌లో మొత్తం 31,61,310 బీపీఎల్‌ కుటుంబాలను గుర్తించారు. ఇందులో 16,28,744 కుటుంబాలు తీవ్ర పేదరికంలో ఉండగా, 15,32,566 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. 2020-21లో 1047 కుటుంబాలు బీపీఎల్‌లోకి వెళ్లిపోయాయి. 2021-22లో కొత్త బీపీఎల్‌ కుటుంబాల సంఖ్య 1751గా, 2022-23లో 303గా ఉన్నాయి. అంటే ఒక్క మూడేండ్లలోనే పేద కుటుంబాల సంఖ్య 3101కి పెరిగింది. అహ్మదాబాద్‌ కేంద్రంగా పని చేసే ఆర్థికవేత్త హేమంత్‌ కుమార్‌ షా మాట్లాడుతూ.. ” 31.64 లక్షల పేద కుటుంబాల్లో ఒక కుటుంబంలో సగటున ఆరుగురు సభ్యులనుకుంటే, బీపీఎల్‌ జనాభా 1.89 కోట్లుగా ఉంటుంది. అంటే మూడో వంతు జనాభా పేదరికంలో ఉన్నారు” అని అన్నారు.
బనాస్‌కాంతా జిల్లాలో అత్యధికం
బనాస్‌కాంతా జిల్లాలో అత్యధికంగా 2,37,078 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. రెండో స్థానంలో దహౌడ్‌ జిల్లా 2,25,520 బీపీఎల్‌ కుటుంబా లను కలిగి ఉన్నది. పోర్‌బందర్‌లో అత్యల్పంగా 21,065 కుటుంబాలు బీపీఎల్‌ జాబితాలో ఉన్నాయి. ‘పని చేయని డబుల్‌ ఇంజిన్‌ సర్కారు’గుజరాత్‌ మోడల్‌ అని చెప్పుకొని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ నిలిచి 2014 ఎన్నికల్లో గెలిచారనీ, అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో.. రెండు చోట్లా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయనీ, పైగా ఇది ప్రధాని మోడీ స్వంత రాష్ట్రమే అయినా బీజేపీ చెప్పుకునే ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారు ఇక్కడ పని చేయటం లేదనటానికి పేదరికంపై రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలే నిదర్శనమని చెప్తున్నారు. దాదాపు 25 ఏండ్లకు పైగా గుజరాత్‌ను బీజేపీ పాలిస్తున్నదని వారు గుర్తు చేస్తున్నారు.
ధరల ప్రాతిపదికన…
ల1973-74 ధరల ఆధారంగా దారిద్య్ర రేఖను గ్రామీణ ప్రాంతాలలో రూ.49.09గా, పట్టణ ప్రాంతాలలో రూ.56.64గా నిర్ణయించడం జరిగింది. 1993లో ఏర్పడిన డీటీ లక్డావాలా నిపుణుల బృందం దారిద్య్ర రేఖను పునర్నిర్వచించలేదు. అయితే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రేఖను ఏర్పాటు చేసింది. కనీస కేలరీల నిబంధనను తొలగించాలని 2009లో టెండుల్కర్‌ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. పౌష్టికాహార ప్రయోజనాలు, ఆరోగ్యం-విద్యపై ప్రైవేటు వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. సమాచార సేకరణలో కచ్చితమైన పద్ధతులను పాటించింది. రోజుకు కనీస వ్యయంగా ఒక్కో వ్యక్తికి గ్రామీణ ప్రాంతాలలో రూ.26, పట్టణ ప్రాంతాలలో రూ.32గా దారిద్య్ర రేఖను నిర్ణయించింది.

Spread the love