ఐదేండ్లలో తగ్గిన పేదరికం

-13.5 కోట్ల మంది గరిబీ నుంచి విముక్తి..
– గ్రామీణ ప్రాంతాల్లో 32.59 శాతం నుంచి 19.28 శాతానికి క్షీణత : నిటి ఆయోగ్‌ నివేదిక
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఐదేండ్లలో (2015-16, 2019-21 మధ్య) 13.5 కోట్ల (13,54,61,035) మంది పేదరికం నుంచి బయటపడ్డారని నిటి ఆయోగ్‌ తెలిపింది. సోమవారం ‘నేషనల్‌ మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌: ఎ ప్రోగ్రెస్‌ ఆఫ్‌ రివ్యూ 2023′ నివేదికను నిటి ఆయోగ్‌ వైస్‌-చైర్మెన్‌ సుమన్‌ బెరీ, సభ్యులు వికె పాల్‌, అరవింద్‌ వీరమణి, నిటి ఆయోగ్‌ సీఈఓ బివిఆర్‌ సుబ్రహ్మణ్యం విడుదల చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16) మధ్య పేదరికాన్ని తగ్గించడంలో దేశం పురోగతిని జాతీయ బహుమితీయ పేదరిక సూచిక (ఎంపీఐ) సూచిస్తుందని నిటి ఆయోగ్‌ తెలిపింది. పోషకాహారం, పిల్లలు, కౌమారదశ మరణాలు, తల్లి ఆరోగ్యం, పాఠశాల విద్య, పాఠశాల హాజరు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, ఇండ్లు, ఆస్తులు , బ్యాంకు ఖాతాలు వంటి మొత్తం 12 అంశాలు ప్రాతిపదికన ఈ నివేదిక ఇచ్చారు. నివేదిక ప్రకారం దేశంలో బహుమితీయ పేదల సంఖ్య 2015-16లో 24.85 శాతం నుంచి 2019-2021లో 14.96 శాతానికి 9.89 శాతం (13,54,61,035 మంది) పాయింట్ల గణనీయమైన క్షీణతను నమోదు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి వేగంగా క్షీణించింది. అదే సమయంలో, పట్టణ ప్రాంతాల్లో పేదరికం 8.65 శాతం నుంచి 5.27 శాతానికి తగ్గింది.ఉత్తరప్రదేశ్‌ పేదల సంఖ్యలో గణనీయమైన క్షీణత నమోదైంది. 3.43 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 707 అడ్మినిస్ట్రేటివ్‌ జిల్లాలకు పేదరికం అంచనాల్లో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పేదల నిష్పత్తిలో అత్యంత వేగంగా తగ్గుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.
ఐదేండ్లలో.. ఎంపీఐ విలువ 0.117 నుంచి 0.066కి సగానికి తగ్గింది. పేదరికం తీవ్రత 47 శాతం నుంచి 44 శాతానికి తగ్గింది. పారిశుధ్యం, పోషకాహారం, వంట ఇంధనం, ఆర్థిక సమ్మేళనం, తాగునీరు, విద్యుత్తును మెరుగుపరచడంపై ప్రభుత్వం అంకితభావంతో దృష్టి సారించడం ఈ రంగాలలో గణనీయమైన పురోగతికి దారితీసిందని నిటి ఆయోగ్‌ పేర్కొంది. ఎంపీఐ మొత్తం 12 ప్రాతిపదికన గుర్తించదగిన మెరుగుదలను చూపించాయని తెలిపింది. పేదరికాన్ని తగ్గించడంలో పోషకాహారంలో మెరుగుదలలు, పాఠశాల విద్య, పారిశుధ్యం , వంట ఇంధనం ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొంది.
తెలంగాణలో పేదరికం నుంచి బయటపడ్డ 27.61 లక్షల మంది
తెలంగాణలో (2015-16, 2019-21 మధ్య) ఐదేండ్లలో 27,61,201 మంది ప్రజల పేదరికం నుంచి బయట పడ్డారు. 2015-16లో 13.18 శాతం నుంచి 2019-2021లో 5.88 శాతానికి 7.3 శాతం పేదరికం తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 19.51 శాతం నుంచి 7.51 శాతానికి వేగంగా క్షీణించింది. అదే సమయంలో, పట్టణ ప్రాంతాల్లో పేదరికం 4.92 శాతం నుంచి 2.73 శాతానికి తగ్గింది.
ఏపీలో పేదరికం నుంచి బయటపడ్డ 30.19 లక్షల మంది
ఆంధ్రప్రదేశ్‌లో (2015-16, 2019-21 మధ్య) ఐదేండ్లలో 30,19,718 మంది ప్రజల పేదరికం నుంచి బయట పడ్డారు. 2015-16లో 11.77 శాతం నుంచి 2019-2021లో 6.06 శాతానికి 5.71 శాతం పేదరికం తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 14.72 శాతం నుంచి 7.71 శాతానికి వేగంగా క్షీణించింది. అదే సమయంలో, పట్టణ ప్రాంతాల్లో పేదరికం 4.63 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గింది.
వాస్తవానికి పేదరికం తగ్గలేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. గణాంకాల్లో మాత్రం గరిబీ తగ్గిందని కేంద్రం చెప్పుకుంటూ..వాస్తవాలను దాచిపెడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా 2015-16 2019-21
ఆదిలాబాద్‌ 27.12 14.24
హైదరాబాద్‌ 4.21 2.52
కరీంనగర్‌ 8.65 2.50
ఖమ్మం 13.75 3.18
మహబూబ్‌నగర్‌ 24.72 10.27
మెదక్‌ 17.87 9.34
నల్గొండ 13.35 4.40
నిజామాబాద్‌ 21.06 6.76
రంగారెడ్డి 5.31 3.83

జిల్లా 2015-16 2019-21
అనంతపురం 12.47 6.74
చిత్తూరు 9.64 5.66
తూర్పు గోదావరి 8.51 6.13
గుంటూరు 7.26 4.36
కృష్ణా 8.69 4.38
కర్నూలు 19.64 12.84
ప్రకాశం 13.84 6.28
నెల్లూరు 11.27 5.41
శ్రీకాకుళం 14.01 5.20
విశాఖపట్నం 15.10 7.60
విజయనగరం 19.00 8.66
పశ్చిమగోదావరి 9.11 2.42
కడప 9.14 3.34

Spread the love