చెట్లూ.. పుట్టలూ.. పుట్లనిండా చీమలు, చెట్ల నిండా కాకులూ వున్న చీకారణ్యం. అక్కడ మోకాళ్ల మీదికి బిగించి కట్టిన దోవతీ, మీద నడుంకి చుట్టిన ఉత్తరీయం… చేతుల మీదా, భుజాల మీదా, నొసటి మీదా విబూది గీతలూ… తలమీద జడలు కట్టిన జుట్టూ… మూతి మీదినుంచి గడ్డంలోకి జారిన మీసమూ… పొడుగాటి గడ్డం, ముఖంలో మూసుకున్న కళ్లూ… ఆ ముఖాన్ని మోస్తున్న మెడా, ఆ మెడని నిల బెట్టిన వెడల్పాటి ఛాతీ, దాన్ని మోస్తూ ఒంటి కాలు మీద నిలబడ్డది ఓ ఆకారం. ముఖం లోని గడ్డం, మీసాల మధ్య దాక్కున్న నోట్నించి వెలువడ్తున్నది ఓం నమ:శ్శివాయ శబ్దం.
ఏళ్లు గడిచాయి. ఎండలు ఫెళ్లుమన్నవి. వానలు ఫెళఫెళమన్నవి. చలిగాలులకి పళ్లు పటపటమన్నవి. మన్మధుడాఛాయలకు రాలేకపోయాడు. రంభా, ఊర్వశీ మేనకలు ఆ పిచ్‌లో బ్యాటింగ్ చెయ్యలేక క్లీన్ బౌల్డ్ అయ్యారు. భక్తుడి తపస్సు పూచి, కాయై, పండైపోయింది. తెరవడానికి వీల్లేని మూడో కన్నుతోనూ, ఎప్పుడో తప్ప చప్పుడు చేయని ఢమరుకంతోనూ, అలవాటుగా వెంట తెచ్చు కునే త్రిశూలంతోనూ భోళాశంకరుడు భక్తుడి ఎదుట ‘అప్పియర్’ అయ్యాడు. భక్తుడు ఆశ్చ ర్యానందాల జాయింటు కుదుపుతో చేతులు జోడించి నిలబడ్డాడు. భక్తా ఏమి నీకోరిక అన్న స్టాక్ డైలాగుని డెలివరీ చేశాడు శివుడు ‘లుక్ బిఫోర్ యూ లీప్’ అన్నది తెలీక. ‘మేక్ హే వైల్ ది సన్ షైన్స్’ అనుకున్నాడు భక్తుడు. నా తపస్సుకు మెచ్చి వరమీయ వచ్చావా శివా.. మహా శివా.. .ఈశ్వరా.. సర్వేశ్వరా అన్నాడు భక్తుడు. ఉపోద్ఘాతం వద్దు, ‘టైమ్ ఈజ్ మనీ’ అన్నాడు శివుడు. ఉపోద్ఘాతం కట్ చేసి విద్యుద్ఘాతం లాంటి కోరిక కోరాడు భక్తుడు. నా ఈ కుడి చేయిని ఎవని శిరస్సు మీద పెడితే వాడు బూడిదై పోవాలి అన్నాడు. శివుడు కూడా శివ శివా అనుకున్నాడు. వాగ్దానాలను, మేనిఫెస్టోలను తూచాతో సహా మర్చిపోవడం తెలీని ఇన్నోసెంట్ గాడ్ కదా, కమిట్ అయ్యేడు. తథాస్తు అనేశాడు. ఒక్క దూకు దూకేడు భక్తుడు. తన పక్కకు లంఘించిన భక్తుణ్ణి చూసి టెన్షన్ పడ్డ శివుడు ఏమిటిది భక్తా అన్నాడు. అణుపరీక్షకి పోఖ్రాన్, కరాస్త్ర పరీక్షకి మీమస్తకం అనగా యువర్ హెడ్ అన్నాడు భక్తుడు. ఉలికికపడ్డ శివుడు మాయమవడం మరిచి రన్నింగ్ మొదలుపెట్టేడు.
పోలింగ్ బూత్‌కి ఓటెయ్యడానికి ఓటర్ కు వున్న శక్తి, అది వేసి తిరిగి వచ్చేప్పుడు వుండదు. వరమిచ్చేశాక శివుడికీ అంతే. పరుగు లంకించుకున్న శివుడ్ని ఫాలో అయ్యేడు భక్తుడు.
ఒక అద్భుతమైన కాంతి. గడ్డ కట్టిన చంద్రుడ్ని కరిగించి పారబోసినట్టు అన్నిలోకాలకీ విస్తరించిన కాంతి. ఆ కాంతి పుంజాల్ని విరజిమ్ముతున్నది ఓ అద్భుత సౌందర్యరాశి. పాల సముద్రం నురగతో నేసిన జలతారు చీర.. ఒంటికి మొలుచుకు వచ్చినట్టున్న బుట్ట చేతుల రవిక. దాన్ని పట్టి వుంచే అపరంజి అరవంకీలు. అలలు అలలుగా సాగిన కేశాలను బంధించిన నీలి కొప్పు మధ్య మెరిసే నాగరం, పాపిట మధ్య నుంచి సాగి నొసటి మీదికి పాకిన పాపిట బిళ్ల, చెవులకి రవ్వల దుద్దులు, చెవుల వెనుక నుంచి సిగలోకి ఊగుతున్న చెంప సరాలు, ముక్కున ముత్యాల ముక్కెర, కంఠాన్ని కావలించుకున్న కంటె, కాసులపేరూ, చంద్రహారం, ఎదమీదికి ఎగిరిపడే వజ్ర వైఢూర్య హారాలు, ముంజేతికి పచ్చల కంకణాలు, హంసలబారు నీలాల గాజులు పోత పోసిన బంగారు విగ్రహంలాంటి అందగత్తెను నిలబెట్టిన బంగారు గజ్జెల వడ్డాణం… కాళ్లకు మువ్వల పట్టీలు…
కళ్లు చీకట్లు కమ్మే ఆ అద్భుతమైన సౌందర్యాన్ని చూసి తట్టుకోలేక శివుడ్ని చేజ్ చెయ్యడం మానేసి ఆ సుందర్ని ఫాలో చేసేడు భక్తుడు. సుందరి పగడాల పెదవిని మునిపంట నొక్కుతూ, క్రీగంటి చూపుని మత్తెక్కించే చిరునవ్వుని విసిరింది. చిత్తయి… చిత్తరువయి పోయేడతను. ఏడేడు సముద్రాల మద్యాన్ని తాగినట్టు ఆద్యంతమూ లేని మత్తులో మునిగిపోయేడు.
గాలిని పరిమళంతో నింపుతున్నవి పూలు. కొలనులో తామరాకుల మీదికి వొంగి గుసగుసలాడుతున్నవి కలువలు. కలకూజితాలు చేస్తు న్నవి కోయిలలు. జగదేకసుందరి అడుగులో అడుగు వేసి ఆడుతు న్నాడు భక్తుడు. భరత నాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, ఒడిస్సీ, ఫోక్, షేక్, ట్విస్ట్, రాకెన్‌రోల్, డిస్కో, బాల్, బ్రేక్ అన్నీ అయ్యేయి. పట్టు చేలాంచలంతో ముఖానికి పట్టిన చెమట బిందువుల్ని అద్దుకుంటున్న సుందరితో రెండవ రౌండు కంటిన్యూ చేద్దామా అన్నాడు భక్తుడు. ఈ సృష్టిలోని సకల చరా చరాల్ని ఆజ్ఞాపించే సౌందర్యం నీది. ఈ సౌందర్యానికి బానిసన య్యాను అన్నాడు.
మళ్లీ ‘నీతోనే డాన్స్’ మొదలైంది. నాట్యం సాగుతుంటే అన్నాడా భక్తుడు, సుందరీ నా చేత డాన్సు చేయించి, నా నెత్తిమీద నేనే చేయి పెట్టుకునేట్టు చేస్తావని, నన్ను బూడిద చేస్తావని నాకు అనిపిస్తున్నది. అయినా సరే, నీ కోసం నేను ఏమైనా చేస్తాను. సమస్త లోకాల్ని నియంత్రించే నీ శక్తికి తల వంచుతాను. అయితే ఒక్క మాట… శివుడు నాకిచ్చిన పవర్‌ని… అదే మరొకరి తల మీద చేయి పెట్టి బూడిద చేసే శక్తిని నేను బూడిద అయిన తర్వాత నా బూడిదకు కూడా వుండేట్టు చెయ్యి. యుగయుగాలూ ఆ బూడిద పవర్ వారసత్వంగా వచ్చే జనం తల మీద చేయి పెట్టి బూడిద చేసే భస్మాసురుల్ని సృష్టించు. వాళ్లరూపంలో నేను ఎప్పటికీ బతికి వుండడమే కాక, అందరి తలల మీద చేయి పెట్టి బూడిద చెయ్యాలనే నా కోరిక తీర్చుకుంటాను. భస్మాసురుడు, భస్మాసుర జాతి పితామహుడు ఇలా అంటూ వున్నప్పుడు మోహిని తల మీద చేయి పెట్టుకోవడం, ఆమెను అనుకరిస్తూ ‘భస్మభక్తుడు’ తన తలమీద చేయి పెట్టుకోవడం, బూడిద అయిపోవడం జరిగింది.
భస్ముడి బూడిద ఎయిరో డాన్సులు చేస్తూ పోయి బ్రహ్మ రెడీ చేసిపెట్టుకున్న బ్రహ్మ పదార్థం కుప్పలు కొన్నింటిలో కలిసిపోయింది. బూడిద కల్సిన ‘మ్యాన్ మేకింగ్ మెటీరియల్’తో తయారయిన మనుషులు సంపూర్ణ స్వార్థ రాజకీయ నాయకులయ్యేరు. స్కామ్‌ల స్వాములయ్యేరు, భూ బకాసురులు, బందిపోట్లు, వెన్నుపోట్లు, బ్యాంకులను దివాలా తీయించే వారూ, చెరువుల్ని చంపేవాళ్లు, అబద్దపు హామీలు ఇచ్చేవాళ్లు, ఓటుకు నోటు ఇచ్చే వాళ్లు, అధికారం కోసం పడిచచ్చేవాళ్లు అయ్యారు.
బ్రహ్మ పదార్థంలో బూడిద కలవని ‘మెటీరియల్’తో తయారైన వాళ్లంతా ‘ఉత్తి ఓటర్ల’య్యారు.
– చింతపట్ల సుదర్శన్
9299809212