ప్రబీర్‌ అరెస్టు చెల్లదు

Prabir's arrest is invalid– కస్టడీ చట్టవిరుద్ధం..తక్షణమే విడుదల చేయండి
– తీర్పు ప్రతిని పుర్కాయస్థకు అందజేయలేదు
– అది ఆయన హక్కులకు భంగకరం : సుప్రీంకోర్టు
ఏడు నెలలపాటుజైలు జీవితం గడిపా. దేశమంతా సంఘీభావంగా నిలిచినందుకు సంతోషంగా ఉన్నది. సుదీర్ఘ పోరాటం చేశా.. కోర్టుల్లో నా పోరు ఆగదు. బాసటగా నిలిచిన  అందరికీ ధన్యవాదాలు. – న్యూస్‌ క్లిక్‌ చీఫ్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ 
న్యూఢిల్లీ : ఉపా కేసులో అరెస్టు చేసిన న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు, ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసులో సరైన ఆధారాలు చూపడంలో పోలీసులు విఫలమయ్యారని, కాబట్టి ప్రబీర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ ప్రబీర్‌పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రబీర్‌ కస్టడీ చట్టవిరుద్ధమని, అరెస్టుకు కారణాలు చూపుతూ రిమాండ్‌ ప్రతిని ఆయనకు అందజేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవారు, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన బెంచ్‌ ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే ఇప్పటికే ఛార్జిషీటు దాఖలైనందున ఆయనను బెయిల్‌పై విడుదల చేయాలని న్యాయస్థానం నిర్ణయించింది. కాగా సుప్రీం ఆదేశాలతో బుధవారం ప్రబీర్‌ జైలు నుంచి విడుదలయ్యారు.
కోర్టు ఏం చెప్పింది?
‘ప్రబీర్‌ను అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత రిమాండ్‌కు పంపడం చట్టం దృష్టిలో చెల్లుబాటు కావు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో సహజ న్యాయ సూత్రాలను పోలీసులు ఉల్లంఘించారంటూ వారి తీరుపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసింది. రిమాండ్‌ కాపీని ప్రబీర్‌కు అందజేయకపోవడం ఆయన హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. అరెస్టుకు కారణాలేమిటో నిందితులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలంటూ పంకజ్‌ బన్సాల్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ఢిల్లీ పోలీసుల తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదనలు వినిపిస్తూ అరెస్టుకు సంబంధించి పోలీసులకు ఉన్న అధికారాలను అడ్డుకోకూడదని అన్నారు. అయితే దీనితో న్యాయస్థానం ఏకీభవించలేదు. తనను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రబీర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ డెమొక్రసీ అండ్‌ సెక్యులరిజం (పీఏడీఎస్‌)తో కలిసి ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు కుట్ర పన్నారని ప్రబీర్‌పై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఆరోపించారు. భారత సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసేందుకు, దేశానికి వ్యతిరేకంగా అవిశ్వాసాన్ని కలిగించేందుకు న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ చైనా నుండి పెద్ద ఎత్తున నిధులు పొందిందని అందులో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రబీర్‌ను పోలీస్‌ కస్టడీకి పంపుతూ ట్రయల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఆయన హైకోర్టులో సవాలు చేశాయి. అయితే హైకోర్టు కూడా 2023 అక్టోబర్‌ 13న ట్రయల్‌ కోర్టు ఆదేశాలను సమర్ధించడంతో ఆయన అప్పటి నుండి జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు.
ఏం జరిగింది?
చైనా అనుకూల ప్రచారం కోసం న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌కు నిధులు అందుతున్నాయంటూ గత సంవత్సరం ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికలో ఓ కథనం వచ్చింది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా సంపన్నుడు నెవిల్‌ రారుసింగం నుండి న్యూస్‌క్లిక్‌ నిధులు పొందిందని ఆ కథనంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఉపా కింద కేసు నమోదు చేశారు. న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌, దానిలో పనిచేసే పాత్రికేయులకు చెందిన దాదాపు 30 ప్రదేశాలపై ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం గత ఏడాది అక్టోబర్‌ 3న దాడులు చేసింది. డిజిటల్‌ పరికరాలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది. అదే రోజు ప్రబీర్‌ పుర్కాయస్థతో పాటు అమిత్‌ చక్రవర్తిని కూడా అరెస్ట్‌ చేశారు.
ఢిల్లీ కోర్టు బెయిల్‌
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రబీర్‌ పుర్కాయస్థకు ఢిల్లీ కోర్టు (ట్రయిల్‌ కోర్టు) బెయిల్‌ మంజూరు చేసింది. అదనపు సెషన్స్‌ జడ్జి హర్దీప్‌ కౌర్‌ బెయిల్‌ మంజూరు చేశారు. అలాగే రూ.1 లక్ష విలువైన బెయిల్‌ బాండ్‌లను ఇచ్చి పుర్కాయస్థను విడుదల చేయాలని ఆదేశించారు. అయితే కొన్ని షరతలు పెట్టారు. కేసుతో సంబంధం ఉన్న సాక్షులు, ఆమోదించేవారిని సంప్రదించకూడదనే షరతు విధించారు. కేసు మెరిట్‌ల గురించి మాట్లాడొద్దని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లవద్దని కూడా కోర్టు ఆదేశించింది. చార్జిషీట్‌లో పేరు ఉన్న ఎవరినీ పుర్కాయస్థ సంప్రదించకూడదని షరతు విధించాలని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే దాని కోసం ఒత్తిడి చేయకూడదని నిర్ణయించుకోవల్సి వచ్చింది. తన క్లయింట్‌ భాగస్వామి గీతా హరిహరన్‌ పేరు కూడా చార్జిషీట్‌లో ఉందని పుర్కాయస్థ తరపున వాదిస్తున్న న్యాయవాది అర్ష్‌దీప్‌ సింగ్‌ ఎత్తి చూపారు. దీంతో ఢిల్లీ పోలీసులు దాన్ని విరమించుకున్నారు.
తీర్పును స్వాగతించిన సీపీఐ(ఎం), ప్రజా సంఘాలు
న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టు అక్రమమని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఐ(ఎం)తో పాటు ప్రజాసంఘాలు స్వాగతించాయి. బుధవారం ఈ మేరకు సీపీఐ(ఎం), ఏఐకేఎస్‌, ఎఐఏడబ్ల్యూయూ, ఎస్‌ఎఫ్‌ఐ,డీవైఎఫ్‌ఐ, సంయుక్త కిసాన్‌ మోర్చా వంటి రైతు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. ”ఏడు నెలల క్రితం 2023 అక్టోబర్‌లో అరెస్టు చేసిన తరువాత, రిమాండ్‌ ఆర్డర్‌ను ఆమోదించే ముందు ప్రబీర్‌కు రిమాండ్‌ దరఖాస్తు కాపీని అందించలేదు. ప్రబీర్‌ న్యాయవాదికి కూడా సమాచారం ఇవ్వకుండా మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడంలో ఢిల్లీ పోలీసులు ప్రదర్శించిన ‘హడావుడి’పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అరెస్టు ”చట్టవిరుద్ధం” అన్ని సంఘాలు ఖండించాయి. సుప్రీంకోర్టు తీర్పు మా వైఖరిని సమర్థిస్తోంది” అని తెలిపాయి.
”చారిత్రాత్మకమైన రైతాంగ ఉద్యమ సమయంలో రైతుల గొంతెను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో న్యూస్‌క్లిక్‌ ప్రశంసనీయమైన, సాహసోపేతమైన పాత్ర పోషించడం గమనార్హం. ప్రబీర్‌ను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ, నిరంకుశ చర్యకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి ఏఐకేఎస్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా,ఇతర సంఘాలు దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించాయి. స్వతంత్ర మీడియాపై దాడిపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీలు, బహిరంగ సభలు, పోస్టర్‌ ప్రచారాలు చేపట్టాయి. ఢిల్లీ పోలీసుల తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను వేర్వేరు కేంద్రాల్లో తగులబెట్టి అరెస్టు చేయడాన్ని ప్రశ్నించాయి” అని తెలిపింది.
”సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు నిస్సందేహంగా దేశంలో ప్రజాస్వామ్యానికి మద్దతు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు సమర్థిస్తున్న నిరంకుశత్వానికి ఎదురుదెబ్బగా అభివర్ణించాయి. ఎల్గర్‌-పరిషత్‌ కేసులో పౌర సమాజ కార్యకర్త గౌతమ్‌ నవ్‌లాఖా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని గత కొద్దిరోజులుగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలాంటి ఉదంతాలు భారత న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతాయి” అని పేర్కొన్నాయి.
”న్యూస్‌క్లిక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన 7,400 చార్జిషీట్‌లకు వ్యతిరేకంగా ప్రబీర్‌ న్యాయ పోరాటం కొనసాగిస్తున్నందున మేం ప్రబీర్‌కు అండగా ఉంటాము. స్వతంత్ర మీడియాను అణచివేయాలని కోరుకునే శక్తులపై ఆయన విజయం సాధిస్తారని మేం గట్టిగా నమ్ముతున్నాం” అని పేర్కొన్నాయి.

Spread the love