ప్రాక్టీస్‌ మొదలెట్టారు!

– కోహ్లి, సిరాజ్‌, ఉమేశ్‌, అశ్విన్‌ సాధన
– ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌
లండన్‌ : ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌ ప్రారంభించారు. రెండు విడతలుగా ఇంగ్లాండ్‌కు చేరుకున్న భారత క్రికెటర్లు.. అంతిమ సమరం సన్నాహాక బరిలోకి దిగారు. విరాట్‌ కోహ్లి, యశస్వి జైస్వాల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఉమేశ్‌ యాదవ్‌ సహా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండో విడత బృందంలో లండన్‌లో కాలుమోపారు. విరాట్‌ కోహ్లి, జైస్వాల్‌, అశ్విన్‌, ఉనద్కత్‌, ఉమేశ్‌ యాదవ్‌లు సోమవారమే గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగా.. నాయకుడు రోహిత్‌ శర్మ మంగళవారం నుంచి బ్యాట్‌ పట్టనున్నాడు. భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పంచుకుంది.
కోహ్లి జోష్‌ : భారత క్రికెట్‌ శిబిరంలో విరాట్‌ కోహ్లి జోష్‌ వచ్చింది. రెండేండ్ల క్రితం ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో కోహ్లి నాయకత్వంలో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన టీమ్‌ ఇండియా.. నేడు విరాట్‌ బ్యాటింగ్‌ సారథ్యంలో మరోసారి ఐసీసీ టెస్టు గదపై కన్నేసింది. కిట్‌తో అరుండెల్‌ క్యాసిల్‌ క్రికెట్‌ క్లబ్‌కు వచ్చిన విరాట్‌ కోహ్లి.. టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారాతో కలిసి కఠోరంగా బ్యాటింగ్‌ చేశాడు. ఇషాన్‌ కిషన్‌, మహ్మద్‌ సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌లు రెగ్యులర్‌ కసరత్తులు పూర్తి చేసుకుని బ్యాటింగ్‌, బౌలింగ్‌ సాధన చేశారు. చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ ఆటగాళ్లతో సుదీర్ఘంగా మాట్లాడుతూ కనిపించారు.
నో వార్మప్‌ గేమ్‌ : 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరుకు ముందు ఇటు భారత జట్టుకు, అటు ఆస్ట్రేలియా జట్టుకు ఎటువంటి వార్మప్‌ మ్యాచులు షెడ్యూల్‌ చేయలేదు. భారత్‌, ఆస్ట్రేలియాలు టెస్టు క్రికెట్‌ అంతిమ సమరం కోసం ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టినా.. వార్మప్‌ మ్యాచులు ఏర్పాటు చేసే బాధ్యత ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసిబి)పై లేదు. ద్వైపాక్షిక సిరీస్‌కు రాకపోవటంతో ఈసిబి వార్మప్‌ మ్యాచ్‌లపై దృష్టి నిలపలేదు. మరోవైపు ఇంగ్లీష్‌ కౌంటీ సీజన్‌ జోరుగా సాగుతున్న దశలో వార్మప్‌ మ్యాచుల ఏర్పాటు సైతం కష్టసాధ్యమే!. ఆతిథ్య బాధ్యతల దృష్ట్యా ఇరు జట్ల ప్రాక్టీస్‌కు ఈసిబి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
స్టేడియం ఫుల్‌! : టెస్టు క్రికెట్‌ అంతిమ సమరానికి లండన్‌లోని ది ఓవల్‌ మైదానం నిండిపోతుందని ఐసిసి అంచనా వేస్తోంది. ఐదు రోజుల అల్టిమేట్‌ టెస్టుకు ఓ రోజు అదనంగా రిజర్వ్‌ చేశారు. వాతావరణ సమస్యలతో నష్టపోయిన ఆటను రిజర్వ్‌ డే రోజు కొనసాగించే వీలుంటుంది. టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కనీసం నాలుగు రోజుల పాటు స్టేడియం నిండుకుండలా ఉంటుందని ఐసిసి భావిస్తోంది. ‘ప్రపంచ క్రికెట్‌లో రెండు అగ్ర జట్లు పోటీపడుతున్నాయి. రానున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లు సైతం ఇదే ఫార్మాట్‌లో కొనసాగుతాయి. భారత్‌, ఆస్ట్రేలియా తలపడే టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అభిమానుల నుంచి అపూర్వ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నాం. అందుకోసం ఈసిబితో కలిసి సరైన దిశగా అడుగులు వేస్తున్నామని’ ఐసిసి ఓ ప్రకటనలో తెలిపింది.

Spread the love