సత్యనిష్ట, నిజాయితి పాటించడమే జాతి సౌభాగ్యానికి శ్రేయస్కరం

Practicing truthfulness and honesty is good for the welfare of the nation– దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్
– నిఘా అవగాహన వారోత్సవంలో భాగంగా ఇంటిగ్రిటీ వాకథాన్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే
నవతెలంగాణ – హైదరాబాద్:
దక్షిణ మధ్య రైల్వే నిఘా అవగాహన వారోత్సవంలో భాగంగా 2 నవంబర్ 2024న నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ ప్రాంగణములో దక్షిణ మధ్య రైల్వే ఇంటిగ్రిటీ వాకథాన్‌ను నిర్వహించింది. ఈ ఐక్యత వాకథాన్ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వేఅదనపు జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ అగర్వాల్ దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ జె.వినయన్‌, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, హైదరాబాద్‌ డివిజన్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌, సీనియర్ రైల్వే అధికారులు, క్రీడాకారులు, రైల్వే సిబ్బంది, పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు సత్యనిష్ట, నిఘా ప్రాముఖ్యతపై అవగాహాన కల్పించేందుకు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం – ప్రజా జీవితంలో సత్యనిష్ట సంస్కృతిని, నిస్వార్థతను పెంపొందించడానికి, అవినీతి యొక్క ప్రతికూల ప్రభావాన్ని ప్రచారం చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అవినీతిని సున్నా స్థాయికి తీసుకురావడానికి దక్షిణ మధ్య రైల్వే యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించడం. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. సత్యనిష్ట అంటే కేవలం నిజాయితీ మాత్రమే కాదు, మన మేధస్సు  మనస్సు యొక్క మిళితం అని కూడా తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో మంచి విలువలు, అభ్యాసాలను ఏకీకృతం చేస్తూ జీవన విధానంగా మార్చుకోవాలని అన్నారు. సహోద్యోగులు, పొరుగువారిలో కూడా ఆ సంస్కృతిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కేవలం మనలో చిత్తశుద్ధిని పాటించడమే కాకుండా మన సమాజం చుట్టూ చిత్తశుద్ధితో కూడిన సంస్కృతిని వ్యాపింప చేయాలని అన్నారు. మనం చిత్తశుద్ధితో ఏది చేసినా అది మన జాతి సౌభాగ్యానికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు. నిఘా అవగాహన వారోత్సవంలో భాగంగా ప్రజలకు, పాఠశాల/కళాశాల విద్యార్థులకు,  రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించేందుకు శిక్షణలు, సెమినార్‌లు, పోటీలు వంటి పలు కార్యక్రమాలను చేపట్టినందుకు విజిలెన్స్ శాఖను జనరల్ మేనేజర్ అభినందించారు. దేశ శ్రేయస్సు కోసం సంపూర్ణ సత్యనిష్ట, నిజాయితీని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ జె.వినయన్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ వాక్‌థాన్‌తో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ముగిశాయని ఆయన తెలిపారు. నిజాయతీతో, గుణ బలంతో జాతిని ఏకతాటిపైకి తెచ్చిన ప్రసిద్ధి చెందిన గొప్ప నాయకుడైన సర్దార్ వల్ల భాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిఘా అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనరల్ మేనేజర్ జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీలో ‘కల్చర్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రోస్పెరిటీ’ అనే అంశంపై నిర్వహించిన క్యారికేచర్ పెయింటింగ్ విజేతలకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.

Spread the love