ప్రజా చైతన్య దీపిక

Praja Chaitanya Deepika– శ్రామిక ప్రజల మార్గదర్శి
– సామాజిక, సాహిత్య విశ్లేషణలకు ప్రేరణ
– నందిని సిధారెడ్డి.. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్‌
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి దారుల వెంట పురోగమింప చేయాలని అవతరించిన పత్రిక నవతెలంగాణ. పాలక సమూహాల అధికార సందోహాల నడును, పెట్టుబడి దారుల వ్యాపార వ్యూహాల నడుమ, మార్కెట్ల విపరీత లాభదాహాల నడుమ ఇవేవీ లేని ప్రజా చైతన్య దినపత్రిక నిలదొక్కుకొనటం బహుకష్టం. అట్లా నిలదొక్కుకొని, తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న పత్రిక నవతెలంగాణ. ట్రేడ్‌ యూనియన్‌ వార్తలు, వ్యవసాయ సమస్యల సమాచారం, సామాజిక, ఆర్థిక పరిణామాల విశ్లేషణలు, వామపక్ష కార్య కలాపాల చలనాలు ఏవి కావాలన్నా నవతెలంగాణ చదవాల్సిందే. వాటన్నిటి వేదిక నవతెలంగాణే. వర్తమాన తెలుగు సాహిత్య సంచలనాలకు దర్పణం ”దర్వాజ”. నవకవుల నుంచి ప్రఖ్యాత రచయితల ప్రతి స్పందనలకు దర్వాజ తోరణం కడుతున్నది. సృజనకు, సాహిత్య విశ్లేషణలకు ప్రేరణ కలిగించే పేజీ దర్వాజ. ‘మానవి’ మహిళా చైతన్యానికి స్ఫూర్తిగా నిలిస్తే, ‘జోష్‌’ యువతరానికి మార్గదర్శనం చేసే విజయగాధలతో ఉత్సాహపరుస్తున్నది. వివిధ శీర్షికల కదంబం ఆదివారం సోపతి- సగటు పాఠకుల అభిరుచులకు స్థానం కల్పిస్తూనే సమాజ చింతనం వైపు కదిలిస్తున్నది. బాలల ఆలోచనలను తీర్చిదిద్దే శీర్షిక ‘నెమలీక’ వినోదంతో సమానంగా వికాసం పంచుతున్నది.

సంపాదకపేజీ సామాజిక భావధార. పాఠకుల్ని ప్రయోజకులుగా తీర్చే రచనలు, సగటు ఆలోచనలను శాస్త్రీయంగా మలిచే సంపాదకీయాలు. దేశ, విదేశీ ఆర్థిక రాజకీయ పరిణామాలను లోతుగా విశ్లేషించే వ్యాసాలు ప్రచురిస్తున్నది. సాంకేతిక మాధ్యమాలు సగటు పౌరుని ఆలోచనలను ఛిన్నాభిన్నం చేస్తుంటే సరైన ఆలోచనను, స్పష్టమైన అవగాహనను, సామాజిక దృక్పథాన్ని, సమగ్రజ్ఞానాన్ని సంపాదకీయాలు కలిగిస్తున్నాయి. ఒక్కమాటలో ప్రగతి దిశా నిర్దేశం చేసే పేజీ ఎడిట్‌ పేజీ. సమాజసేవలో నిరంతర ప్రయాణం చేస్తున్న నవతెలంగాణకు నవ వార్షికోత్సవ శుభానందనలు.

Spread the love