– పార్టీ కార్యకర్తలు, శ్రేణులతో మంత్రి దామోదర ముఖాముఖి మొదటి రోజు 285 దరఖాస్తులు
– అక్కడికక్కడే 30 దరఖాస్తులను పరిష్కరించిన మంత్రి
– సాయం కోసం హెచ్‌ఐవీ సోకిన ఓ బాలిక, మరో మహిళ అర్జీ
– మెడికల్ పెండింగ్ బిల్లుల కోసం వినతులు
– రేషన్‌కార్డులు, భూసమస్యలు, రేషన్, నిర్వాసితులు, ఇండ్ల కోసం…
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణుల కోసం టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో ప్రజావాణికి శ్రీకారం చుట్టారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలతోపాటు వివిధ సమస్యలతో బాధ పడుతున్న ప్రజలు గాంధీభవన్‌కు భారీగా తరలి వచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మొదటి రోజు ప్రజావాణి కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షులతో కలిసి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వహించారు. ఉదయం 11.30 ప్రారంభమైన ముఖాముఖి కార్యక్రమం మధ్యాహ్నం మూడున్నర వరకు నిర్విరామంగా జరిగింది. మొదటి రోజు వివిధ సమస్యలపై 285 విజ్ఞప్తులు వచ్చాయి. అందులో 30 వరకు మంత్రి అప్పటికప్పుడే పరిష్కరించారు. మరికొన్నింటిని సంబంధిత ఉన్నతాధికారులకు, ఆయా కలెక్టర్లకు పంపించారు. అందులో ఇద్దరు డయాలిసిస్ రోగులు తమ బాధలు చెప్పగానే మంత్రి దామోదర వారిని నిమ్స్‌కు అటాచ్ చేశారు. హెచ్‌ఐవీ సోకిన ఒక బాలిక, మరో మహిళలకు పెన్షన్‌తోపాటు వైద్య సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు వివిధ రోగాలతో బాధపడుతూ చికిత్స తీసుకున్న తర్వాత మెడికల్ బిల్లులు రావడం లేదంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు. వారికి భరోసా కల్పించి త్వరలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వైద్య సేవలు అవసరం ఉన్న వారు, డబుల్ బెడ్ రూమ్, రేషన్ కార్డులు ఇలా అనేక సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. మహిళలు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. జీవో నెంబర్ 317 బాధితులు, భూ వివాదాలు, కొండ పోచమ్మ నిర్వాసితులు, బీఆర్‌ఎస్ సర్కారు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేత, ఉపాధ్యాయ, ఉద్యోగ బదిలీలపై వినతులు వచ్చాయి. తన శాఖకు సంబంధించిన అంశాలపై వెంటనే పరిష్కరించాలని దామోదర అధికారులకు సూచించారు. మొత్తం దరఖాస్తులను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు టీపీసీసీ సిబ్బంది కంప్యూటర్‌లో శాఖల వారీగా దరఖాస్తులను నమోదు చేశారు. ఆయా శాఖల వారీగా దరఖాస్తులను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లేఖలను జత చేసి మంత్రులకు పంపిస్తారు.
మహేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందన్నారు. అందుకే వాళ్ళ కోసం గాంధీభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం పెట్టామన్నారు. వారంలో బుధ, శుక్రవారాల్లో మంత్రులు గాంధీభవన్‌కు వచ్చి ప్రజల సమస్యలు వింటారు. ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన అర్జీలను మంత్రులు తీసుకొని సంబంధిత శాఖల అధికారులతో పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ గాంధీ భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం అద్భుతమైన ఆలోచన అన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి అధ్యక్షతన వహించారు. సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్‌రావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయి కుమార్, అధికార ప్రతినిధులు భవాని రెడ్డి, బండారు శ్రీకాంత్, అల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ప్రవాసీ ప్రజావాణి ప్రారంభోత్సవం
హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ఈనెల 27న శుక్రవారం ఉదయం 10 గంటలకు గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ‘ప్రవాసీ ప్రజావాణి’ ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మెన్, అంబాసిడర్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.