ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, పెద్దవాగు

Pranahita is a raging stream– బ్యాక్‌ వాటర్‌తో నీట మునిగిపోయిన పంటలు
– ఆదుకోవాలని రైతుల వేడుకోలు
నవతెలంగాణ-దహెగాం
ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత, పెద్దవాగు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాల కారణంగా ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంటే దానికి పెద్దవాగు ప్రవాహం జతకట్టడంతో రెండు నదులు కలిసే చోటు నుండి బ్యాక్‌ వాటర్‌ నీటితో రాంపూర్‌, దిగిడ, మొట్లగూడ, రావులపల్లి గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా బ్యాక్‌ వాటర్‌తో చేన్లు నీట మునిగిపోవడంతో పత్తి మొక్కలు పూర్తిగా నాశనమవుతున్నాయని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు గ్రామాల్లోని పరిస్థితిని విన్నవించినప్పటికీ ఇటు అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ కనీసం చూడడానికి కూడా రావడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
పీపీరావు ప్రాజెక్టు ప్రధాన కాలువకు భారీ గండి
మండలంలో వ్యవసాయనికి సాగునీరు అందించే ఏకైక ప్రాజెక్టు పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టుకు ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన కాలువలో భారీగా వర్షపు నీరు చేరి కొంచవెల్లి గ్రామ సమీపంలో ప్రధాన కాలువకు భారీగా గండి పడింది. దీంతో మూడు రోజులుగా నీరంతా వృథాగా పోతుంది. కొంచవెల్లి, చంద్రపెల్లి, పీకలగుండం తదితర గ్రామాలకు వందలాది ఎకరాల పంట పొలాలకు సాగు నీరు అందించే ప్రధాన కాలువకు గండి పడడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంట పొలాలను సాగుచేసుకొనేందుకు నారుమడులను తయారుచేసి నాటు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఇదే తరుణంలో ప్రధాన కాలువకు పెద్ద గండి పడడంతో నీరంతా వృథాగా పోతుందని, తాము వ్యవసాయం సాగు ఎలా చేసుకొనేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే గండి పూడ్చి రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

Spread the love