ప్రీ క్వార్టర్స్‌లో ప్రణయ్

కిరణ్‌, మంజునాథ్‌లకు నిరాశ
తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
తైపీ (చైనీస్‌ తైపీ) : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారుడు, మలేషియా ఓపెన్‌ చాంపియన్‌ హెచ్‌.ఎస్‌ ప్రణయ్ తైపీ ఓపెన్‌లో టైటిల్‌ వేట మొదలుపెట్టాడు. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన హెచ్‌.ఎస్‌ ప్రణయ్ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించాడు. వరల్డ్‌ నం.9 ప్రణరు తొలి రౌండ్‌ మ్యాచ్‌లో చెమట పట్టకుండా విజయం సాధించాడు. 21-11, 21-10తో లిన్‌ యు సెన్‌ (చైనీస్‌ తైపీ) షట్లర్‌పై సునాయాసంగా గెలుపొందాడు. కామన్‌వెల్త్‌ క్రీడల మాజీ చాంపియన్‌, వెటరన్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ సైతం ముందంజ వేశాడు. మెన్స్‌ సింగిల్స్‌ తొలి రౌండ్లో 21-15, 21-16తో జర్మనీ షట్లర్‌ శామ్యూల్‌పై వరుస గేముల్లో గెలుపొందాడు. ఇక తైపీ ఓపెన్‌లో భారత వర్థమాన షట్లర్లకు నిరాశే ఎదురైంది. కిరణ్‌ జార్జ్‌ 20-22 , 21-12, 9-21తో అమెరికా ఆటగాడు లియోంగ్‌ జన్‌ చేతిలో మూడు గేముల్లో పోరాడి ఓడాడు. సతీశ్‌ కుమార్‌ 10-21, 10-21తో చైనీస్‌ తైపీ షట్లర్‌ చి యు జెన్‌ చేతిలో మట్టికరిచాడు. మిథున్‌ మంజునాథ్‌ 18-21, 21-14, 16-21తో మూడు గేముల మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ షట్లర్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో తాన్య హేమంత్‌ 21-7, 21-17తో హంగేరీ షట్లర్‌ ఆగస్‌పై వరుస గేముల్లో గెలుపొంది ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకుంది. గద్దె రుత్విక శివాని 12-21, 5-21తో వరుస గేముల్లో లోకల్‌ షట్లర్‌ చేతిలో ఓటమి చెందింది. ఆకర్షి కశ్యప్‌ సైతం 21-10, 16-21, 11-21తో మూడు గేముల మ్యాచ్‌లో ఇండోనేషియా షట్లర్‌ చేతిలో పరాజయం పాలైంది.

Spread the love