పీఆర్సీ నూతన కమిటీని నియమించాలి

– ఎస్టీయూ రాష్ట్ర
అధ్యక్షులు సదానందంగౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) నూతన కమిటీని నియమించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది, జులై నుంచే కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉందని చెప్పారు. విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాఠశాలల పున:ప్రారంభం నాటికి ఉపాధ్యాయ ఖాళీల మేరకు విద్యావాలంటీర్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలన్నారు. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. మన ఊరు- మనబడి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు. అందుకనుగుణంగా పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలని డిమాండ్‌ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను ఆర్థిక శాఖ మంజూరు చేయాలని కోరారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలివ్వాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. అవసరమైతే ఐక్య ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, నాయకులు బి రవి, ఏవి సుధాకర్‌, ఎల్‌ఎం ప్రసాద్‌, బ్రహ్మచారి, శ్రీధర్‌రావు, దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love