ముందస్తు బడిబాట..

Early school..– ప్రయివేట్ పాఠశాలతో పోటీ చేరికలు పెంపుదలే లక్ష్యం
– హెచ్ ఎం హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం బడుల్లో ప్రవేశాలు పెంపుదలే లక్ష్యం అని స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) ప్రధానోపాధ్యాయులు హరిత అన్నారు. మంగళవారం ముందస్తు బడిబాట ను వినూత్నంగా ప్రారంభించారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వచ్చే విద్యాసంవత్సరం విద్యార్థులు చేరడానికి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత ఆధ్వర్యంలో పాఠశాల పరిసర గ్రామాలలో ఉన్న ప్రాధమికోన్నత,ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్ధులను కలిసి కరపత్రాలను అందించి ఉపాధ్యాయులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో గల సౌకర్యాలను విద్యార్ధులకు వివరిస్తున్నారు.పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధన,విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయం, ప్రతి తరగతిలో విద్యార్థులకు బల్లలు, ఫ్యాన్స్, శుద్ధిచేసిన తాగునీరు,ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి పదో తరగతి విద్యార్థులకు తర్ఫీదు, నేషనల్ మెరిట్ కం మీన్స్ స్కాలర్ షిప్, కొరకు 8 వ తరగతి విద్యార్ధులకు శిక్షణ, ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు, ఉంటాయని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా కరపత్రాలు ముద్రించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రయివేటు పాఠశాలల నుండి విద్యార్ధులను ఆకర్షించేందుకు ప్రణాళికలు చేబడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఊడల కిషోర్ బాబు, సీ.హెచ్ నర్సింహారావు, కట్టా శ్రీను, లక్ష్మయ్య తదితర ఉపాధ్యాయులు, నారంవారిగూడెం ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, ఆషిక్ ఆలం, సీఆర్పీ సిద్దాంతం ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love