విద్యుత్‌పై చర్చకు సిద్ధం…

– కేసీఆర్‌వన్నీ అబద్దాలే..
– ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘విద్యుత్‌ సమస్యపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? అని ఆ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నీ అబద్దాలే చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఓ మీడియా ఛానల్‌ ఇంటర్వ్యూలో, తాజాగా బహిరంగ సభల్లో కేసీఆర్‌ చేసిన ప్రకటనలు, వాఖ్యల డొల్ల తనాన్ని ఈ సందర్భంగా భట్టి ఎండగట్టారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగం కోలుకోలేని నష్టాలకు గురైందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా ఆ రంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని పేర్కొన్నారు. అవరోధాలన్నింటిని అధిగమించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే 30 ఏండ్లకు రాష్ట్ర ప్రజల విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్‌ చేస్తున్న ప్రకటనలు, వాస్తవాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దీర్ఘకాలిక అవసరాల కోసం చత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేశామంటూ కేసీఆర్‌ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని తెలిపారు. మే6, 2017 నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు డిసెంబర్‌ 2014లో ఒప్పందం చేసుకున్నారనీ, కానీ తెలంగాణ డిస్కమ్‌లకు 300 నుంచి 400 మెగా ఓట్ల కన్నా ఎక్కువ సరఫరా చేయలేదని పేర్కొన్నారు. పైగా ఏప్రిల్‌ 2022 నుంచి విద్యుత్‌ సరఫరాను పూర్తిగా ఆపేశారన్నారు. చత్తీజ్‌స్‌డ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయించటంలో నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఇది వాస్తవం కాగా..పూర్తి అబద్దాలతో ఆయన ప్రచారం చూస్తున్నారనీ, ఇలాంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. తాము అధికారంలోకొచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ పాపాల మూలంగా తెలంగాణ డిస్కంలు వేలకోట్లలో అప్పుల్లో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి డిస్కంల నష్టాలు రూ. 12, 186 కోట్లు కాగా బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో ఆ నష్టాల భారం రూ.62 ,461 కోట్లకు చేరిందని భట్టి ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love