– వర్సిటీల నిర్వహణలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కృషి కీలకం: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– ఓయూ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సదస్సు
నవతెలంగాణ- ఓయూ
యూనివర్సిటీలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ న్యూ సెమినార్ హాల్లో మంగళవారం ఓయూ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పాలడుగు భాస్కర్ మాట్లాడారు. రాష్ట్రంలో 18 యూనివర్సిటీలలో సుమారు పదివేల మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయాల కార్యకలాపాల నిర్వహణలో సిబ్బంది కృషి చాలా కీలకమని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు ప్రశంసించింది కానీ వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు చేయలేదన్నారు. ఇప్పటికైనా హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు, ఉద్యోగులు అందరూ ఐక్యంగా పోరాడితే మన హక్కులు సాధించుకోవచ్చని సూచించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జులై 7న ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్జీవో అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ఉన్న కార్మికులందరం ఐక్యంగా పోరాడాలని, మీ పోరాటాలకి ఎన్జీవో ఆర్గనైజేషన్ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జె.వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా కార్మికులను ఇప్పటికీ పర్మినెంట్ చేయకపోవడం దుర్మార్గం అన్నారు. ఓయూ కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి.మహేందర్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలలో కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలలో ఏజెన్సీల ద్వారా అవుట్‌సోర్సింగ్ కార్మికుల నియామకాలు జరిపి వారి వేతనాలలో కోత విధిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. కార్మికులకు బస్ పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయిన సిబ్బందికి రూ. 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కోరారు. ఈ సదస్సులో కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ విట్టల్‌గౌడ్, ఉపాధ్యక్షులు వెంకటయ్య, గోవింద్, టెక్నికల్ అధ్యక్షులు నాగరాజు, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు శివశంకర్, ఓయూ కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ జనరల్ సెక్రెటరీ సీతారాం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్‌రావు, ఉపాధ్యక్షులు అనసూయ, నాయకులు పుష్పలత, రాణి, మహేందర్ మక్సూడ్, యాదగిరి, సీతయ్య పాల్గొన్నారు.