కాళేశ్వరం నిర్మాణ అక్రమాలపై విచారణకు సిద్ధం

On Kaleshwaram construction irregularities Prepare for trial– హైకోర్టులో సీబీఐ కౌంటర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ స్పష్టం చేసింది. హైకోర్టుగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదేశిస్తే విచారణ చేస్తామని ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు వేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని అభిప్రాయపడింది. ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్స్‌పెక్టర్లు, నలుగురు ఎస్‌ఐలతో పాటు ఇతర సిబ్బంది కావాలని కోరింది. సీబీఐ కౌంటర్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి రెండున మరోసారి విచారిస్తామంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదనీ, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని హైకోర్టుకు తెలియజేసింది. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినా సీబీఐ నుంచి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.
దీనిపై సీబీఐ హైదరాబాద్‌ విభాగం హెడ్‌, ఐపీఎస్‌ అధికారి డీ కళ్యాణ్‌ చక్రవర్తి తన కౌంటర్‌ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి సైతం ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అంశంపై సీబీఐకి పరిమితులు ఉన్నాయనీ, దాన్ని దష్టిలో పెట్టుకుని ఫిర్యాదులపై స్పందించలేదని కౌంటర్‌లో పేర్కొన్నారు. పిటిషనర్‌ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన జరుపుతున్నామనీ, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటనే విషయమై తేలాల్సి ఉందన్నారు.
కేవలం రాష్ట్ర ఉద్యోగులే ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని తెలిపారు. ఈమేరకు ఇటీవల సీబీఐ హైకోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ వేసింది.

Spread the love