‘పద్మ’ అవార్డుల ప్రదానం.. పురస్కారాలు స్వీకరించిన వెంకయ్యనాయుడు, చిరంజీవి

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ సాయంత్రం పద్మ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. తెలుగుజాతి గర్వించేలా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. వెంకయ్యనాయుడు ప్రజా సంబంధ వ్యవహారాల్లో అసాధారణమైన, విశిష్టమైన సేవలు అందించినందుకు ఆయనకు కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. దశాబ్దాలుగా చలనచిత్ర రంగానికి చిరంజీవి చేస్తున్న కళా సేవకు గుర్తింపుగా కేంద్రం ఆయనను పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. పద్మ విభూషణ్ దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం అని తెలిసిందే. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ పురస్కారాలు అందుకున్న వారిలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (పద్మ భూషణ్), ప్రముఖ గాయని ఉషా ఉతుప్ (పద్మ భూషణ్), ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్ (పద్మ భూషణ్), ప్రముఖ పారిశ్రామికవేత్త సీతారామ్ జిందాల్ (పద్మ భూషణ్) తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈసారి కేంద్ర ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించింది. వెంకయ్యనాయుడు, చిరంజీవిలతో పాటు సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం), ప్రముఖ నటి వైజయంతీమాల, సుప్రసిద్ధ నాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం పద్మవిభూషణ్ కు ఎంపికయ్యారు.

Spread the love