15న చెన్నైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నవతెలంగాణ – చెన్నై
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్‌ 15న చెన్నైకి విచ్చేయనున్నారు. గిండి కింగ్‌ ఇనిస్టిట్యూట్‌ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.230 కోట్లతో నిర్మించిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఆమె ప్రారంభించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకలు జూన్‌ 3న ప్రారంభమవుతున్నాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జూన్‌ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ ఆసుపత్రిని ప్రారంభించేలా రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. అదే సమయంలో రాష్ట్రపతి విదేశీ పర్యటన ఖరారు కావటంతో చెన్నై పర్యటన రద్దయ్యింది. ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రిని జూన్‌ 15న ప్రారంభించేందుకు రాష్ట్రపతి విచ్చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. గిండి కింగ్‌ ఇనిస్టిట్యూట్‌ భవన సముదాయాలకు సమీపంలో రూ.51.4 ఎకరాల్లో ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆసుపత్రికి ‘కలైంజర్‌ కరుణానిధి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి’గా నామకరణం చేసింది.

Spread the love