– బూత్‌ల వారీగా పార్టీ బలోపేతానికే విస్తారక్‌ల రాక : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘రాష్ట్రంలో అధ్యక్షుడి మార్పు ఒట్టిమాటే. తరుణ్‌చుగ్‌తో సహా అనేకసార్లు జాతీయ నాయకులు మార్పు ఉండదని చెప్పినా తప్పుడు వార్తలు ఆగడంలేదు. ఆ వార్తలన్నీ చూసీచూసీ అలవాటైపోయింది. దీన్ని తమ కార్యకర్తలెవ్వరూ పట్టించుకోవట్లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు కుమార్ అన్నారు. ‘మేరా బూత్ సబ్‌సే మజ్బూత్’ కార్యక్రమంలో పార్టీ బలోపేతం కోసం బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన విస్తారక్‌లకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీని బూత్‌ల వారీగా తమ పార్టీని బలోపేతం చేసేందుకే ఆయా రాష్ట్రాల నుంచి 650 మంది విస్తారక్‌లు తెలంగాణకు వచ్చారని తెలిపారు. మంచిర్యాల, ఖాజీపేట, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల నుంచి మండల కేంద్రాలకు వెళ్లారన్నారు. వారంతా పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగమవుతారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని బలహీనం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈటల హత్యకు కుట్ర చేసిన వారిపై తక్షణమే విచారణ జరపడంతోపాటు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్‌కు కచ్చితంగా తగిన భద్రత కల్పించాలని కోరారు. పార్టీ బలోపేతం కోసమే ఈనెల 8న 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంఘటనా మంత్రుల సమావేశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తదితరులు పాల్గొన్నారు.