– లీటరు నూనెపై రూ 20 నుంచి 45 పెంపు
– మళ్లీ కొండెక్కిన కోడి
– కిలోరూ 60 దాటిన ఉల్లి
– రూ.400పైనే వెల్లుల్లి
– ఇబ్బందుల్లో ప్రజలు
దసరా పండుగకు 15 రోజుల ముందే ప్రజలపై ధరల పిడుగు పడింది. అన్ని రకాల వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాయగూరలు, ఆకు కూరలు, నూనెలు, మాంసం, పప్పుల ధరలు అమాంతం పెరిగాయి. వారం రోజుల కిందట లీటర్ నూనె ధర రూ.20 నుంచి 45కు పెరిగింది. గతంలో రూ.110 ఉన్న నూనె ప్యాకెట్ ధర రూ.140కి చేరుకుంది. వెల్లుల్లి దిగిరానంటూ రూ.400పైనే ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరోసారి ఈ ధరలు మంట పెడుతున్నాయి.
నవతెలంగాణ- కల్వకుర్తి టౌన్
కిలో చికెన్ రూ.240కి చేరువైంది. ఉల్లి ధర నెల రోజులుగా కిలో రూ.60కిపైగానే పలుకుతోంది. మరో మూడూ నాలుగు రోజుల్లో కిలో రూ.80కి చేరుకునే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు తెలి పాయి. వెల్లుల్లి కిలో రూ.400కు పైగా పలుకు తుండగా.. అల్లం కిలో రూ.180 వరకు ఉంది. ఎండు మిరపకాయల ధర సైతం పెరిగింది. వాటికి తోడు అన్ని రకాల పప్పుల ధరలు కిలో రూ. 20 నుంచి 30కు పైగానే పెరిగాయి. దీంతో ఈ ఏడాది దసరా పండుగ చేసుకునేది ఎలా అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూనె ధరలపై ఎక్సైజ్ సుంకం 12 నుంచి 32 శాతానికి పెంచడంతో నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఏ కూర చేయాలన్నా నూనె తప్పనిసరి కావడం వల్ల ప్రజలపై అధిక భారం పడింది.
కూరగాయల ధరలు
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. టమాటా, బెండ, పచ్చి మిర్చి, దొండకాయ, వంకాయ, క్యాబేజీ తదితర కూరగాయల ధరలు కిలో రూ.50 నుంచి 80కు చేరుకున్నాయి. ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందని అంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూరగాయల తోటలు దెబ్బ తినడం, దళారులు, వ్యాపారులు కుమ్మక్కవడంతో అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి.
ఆకుకూరలదీ అదే దారి
ఆకుకూరల ధరలకూ రెక్కలొచ్చాయి. పాలకూర, తోటకూర, తుంటి కూర తదితర ఆకుకూరల ధరలు భారీగా పెరిగాయి. గతంలో పాలకూర కట్టలు పది రూపాయలకు మూడు ఇచ్చేవారు. ఇప్పుడు 20 రూపాయలకు మూడు కట్టలు మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా కొత్తిమీర, పుదీన ధర పెరిగింది. రూ.10కి కొత్తిమీర చిన్న కట్ట ఇస్తున్నారు.
పండుగ పూట పస్తులే : గృహిణి రమాదేవి
అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల దసరా పండుగ పూట పస్తులుండే పరిస్థితి నెలకొంది. నూన,ె పప్పులు, కూరగాయల ధరలు ఎప్పుడూ లేని విధంగా పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అప్పుచేసి పండుగ చేసుకునే పరిస్థితులు వచ్చాయి.
ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
ఇటీవల అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నూనెపై ఎక్సైజ్ సుంకం గతంలో 12 శాతం ఉంటే 32 శాతానికి పెంచడంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి. ఎన్నికల సమయంలో ధరలు తగ్గించి ఆ తర్వాత పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారు.
– ఆంజనేయులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు